ఈ మధ్య కాలంలో మతపరమైన వివాదాలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. కావాలని చేస్తున్నారో..కాకతాళీయంగా జరుగుతున్నాయో తెలియదుగానీ…దేశంలోని పలు రాష్ట్రాలలో మతపరమైన సున్నితమైన అంశాలు వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జితేంద్ర కుమార్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
పురాణాల్లోనూ అత్యాచార ఉదంతాలున్నాయంటూ వైద్య విద్యార్థులకు జితేంద్ర పాఠాలు చెప్పడం వివాదాస్పదమైంది. లైంగిక నేరాలు అనే అంశంపై ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులకు పాఠం చెబుతున్న సందర్భంగా జితేష్ ఉదాహరణ కోసం పురాణాలవైపు వెళ్లడం వివాదానికి దారి తీసింది. పాఠం భోధించడంలో భాగంగా ఓ కంప్యూటర్ స్లైడ్ చూపిస్తూ హిందూ దేవతలను ప్రస్తావించిన జితేంద్ర…పురాణాల్లోని అత్యాచార ఉదంతాలను క్లాస్ రూంలోనే ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు చెందిన సదరు ప్రొఫెసర్ కు యూనివర్సిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది.
పురాణాల్లో అత్యాచారం అనే కంటెంట్ ను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యాజమాన్యం, ఫ్యాకల్టీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థులు, సిబ్బంది, పౌరుల మత మనోభావాలను గాయపరిచినందుకు జితేంద్ర కుమార్ కు షోకాజు నోటీసు ఇచ్చింది. దీంతో, దిగి వచ్చిన జితేంద్ర కుమార్ తన తప్పునకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. మత సంబంధ మనోభావాలను గాయపరచడం తన ఉద్దేశ్యం కాదని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు.
అత్యాచారాలు అనాదిగా ఉన్నాయని చెప్పడమే తన ఉద్దేశ్యమని అన్నారు. అయితే, ఆ ఉదాహరణ చూపే విషయంలో తన వైపు నుంచి తప్పు జరిగిందని లిఖితపూర్వకంగా యూనివర్సిటీకి క్షమాపణ లేఖను సమర్పించారు. కానీ, ఈ వివాదం దుమారం రేపడంతో ఆ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసింది యూనివర్సిటీ యాజమాన్యం.ఈ క్రమంలోనే సదరు ప్రొఫెసర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణగా చెప్పేందుకు పురాణాలే దొరికాయా అంటూ ఆ ప్రొఫెసర్ ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పురాణాల్లో అత్యాచారలపై పాఠమేంది సామీ?…అంటూ ట్రోల్ చేస్తున్నారు.