అనుకున్నదే జరిగింది. అంచనా అస్సలు తప్పలేదు. ఖలిస్థానీ సానుభూతిపరుడు.. వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత పాల్ సింగ్ పోలీసులకు దొరికిపోయాడు. రెండు రోజుల క్రితం అమృత పాల్ సింగ్ సతీమణి కిరణ్ దీప్ కౌర్ లండన్ వెళ్లేందుకు శ్రీగురు రామ్ దాస్ అంతరజాతీయ ఎయిర్ పోర్టుకు వెళ్లటం.. అక్కడ ఆమె పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో.. అమృత పాల్ ఆటకు చెక్ పడినట్లేనని భావించారు.
భార్య కోసమైనా అతను పోలీసులకు దొరికిపోవటం ఖాయమన్న అభిప్రాయానికి బలం చేకూరుస్తూ అతను పోలీసులకు దొరికిపోయాడు.
మార్చి 18న పోలీసుల కళ్లు కప్పి పరారైన అతను.. సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అతడ్ని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్ల మీద పరుగులు తీసిన పరిస్థితి. పంజాబ్ తో సహా చుట్టుపక్కల ప్రాంతాలన్ని జల్లెడ పట్టినప్పటికీ ప్రయోజనం లభించలేదు. పంజాబీలంతా ఖలిస్థాన్ దేశం కోసం పోరాడాలన్న పిలుపునిస్తున్న అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగాయి.
అతని తలపైన రూ.5లక్షల బహుమానాన్ని కూడా పోలీసులు ప్రకటించారు. అతన్నిపట్టుకునేందుకు వీలుగా పంజాబ్ పోలీసు శాఖలోని ఉద్యోగులకు సెలవుల్ని రద్దు చేసి మరీ వెతికారు. ఈ ప్రయత్నాలన్ని ఒక ఎత్తు అయితే.. రెండు రోజుల క్రితం ఎయిర్ పోర్టులో అమృత పాల్ సతీమణి దొరికిపోవటంతో ఆయన ఆచూకీ లభిస్తుందన్న మాట వినిపించింది. అందుకు తగ్గట్లే తాజాగా పంజాబ్ లోని మెగో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.