టాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే యంగ్ హీరోల్లో నితిన్ ఒకడు. తన కెరీర్లో ఇప్పటివరకు దాదాపుగా వివాదాలేవీ లేవనే చెప్పాలి. కానీ అతడి మీద ఇప్పుడు దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కొంచెం తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశాడు.
‘రణం’ లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్.. ఆ తర్వాత నితిన్‌తో ‘టక్కరి’ అనే చిత్రం తీసిన సంగతి తెలిసిందే. ఓ తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా ‘హై ఫైవ్’ అనే సినిమా తీశాడు. దీనికి నిర్మాత కూడా అతనే.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు వస్తానని మాట ఇచ్చిన నితిన్.. ఉద్దేశపూర్వకంగా రాలేదంటూ అమ్మ రాజశేఖర్ విమర్శలు గుప్పించాడు. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్లో తిరుగుతోంది. ఇంతకీ అమ్మ రాజశేఖర్ ఏమన్నాడంటే..
‘‘నితిన్‌ను ఈ ఫంక్షన్‌కి పది రోజుల ముందే పిలిచాను. వస్తానని చెప్పాడు. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు. వాడికి కెరీర్ ఆరంభం నుంచి డ్యాన్స్ మాస్టర్‌గా ఉండి అన్నీ నేర్పించి ఒక గురువుగా ఉన్నాను నేను. నా ఫంక్షన్‌కి అతను కచ్చితంగా వస్తాడని నమ్మి నేను ఒక ఏవీ కూడా రెడీ చేయించాను. కానీ నితిన్ ఈ ఫంక్షన్‌కి రాలేదు.
అతను రాకపోడానికి కారణం షూటింగ్ ఉండి కాదు. అతను ఇంట్లోనే ఉన్నాడు. తనకు జ్వరం అని చెప్పాడు. కానీ అది నిజం కాదు. కనీసం బైట్ ఇవ్వమని అంటే అది కూడా ఇవ్వలేదు. లైఫ్‌లో ఎవరైనా ఒక స్థాయికి ఎదిగాక దానికి కారణం ఎవరో వాళ్లను మరిచిపోకూడదు. ఒక స్థాయికి వచ్చాక నువ్వు రాలేనంటే రాలేనని చెప్పా.
వస్తా అని చెప్పి రాకుండా ఉంటే నన్ను అవమానించినట్లే. నితిన్.. నేను చాలా అప్సెట్ అయ్యాను. నిన్ను నేను చాలా నమ్మాను. కానీ ఇంట్లో ఉండి కూడా నువ్వు రాలేదు. నేను అప్పెట్ అయ్యాను. మనం లైఫ్‌లో చూస్తాం. మనం కలుస్తాం’’ అని అమ్మ రాజశేఖర్ అన్నాడు. మరి ఈ విమర్శలు, ఆరోపణలపై నితిన్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.