తమకు రాజకీయంగా కాస్తంత పట్టు ఉంటే చాలు.. ఆ రాష్ట్రంలో పాగా వేయటానికి ఏమేం చేయాలో.. అవన్నీ చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేయటం మోడీషాలకు అలవాటే. మరికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణకు మోడీ షాలు.. ఒకరి తర్వాత ఒకరు వస్తూ దిశానిర్దేశం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత వారంలో రెండుసార్లు తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ.. తాజాగా ఆయనకు రైట్ హ్యాండ్ అమిత్ షా.. రేపు (మంగళవారం) తెలంగాణకు వచ్చేస్తున్నారు.
మోడీ.. షాలు ఒకరి తర్వాత ఒకరు చొప్పున తెలంగాణకు వస్తూ.. తెలంగాణలో పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. తెర వెనుక బీజేపీ.. బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం జరిగిపోయినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరగటం.. అందుకు భిన్నంగా ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. గత వారంలో తెలంగాణకు రెండుసార్లు వచ్చిన ప్రధాని మోడీ.. తన ప్రసంగాల్లో అటు బీఆర్ఎస్ ను.. ఇటు కాంగ్రెస్ పైనా ఘాటు విమర్శలు చేయటం తెలిసిందే.
తాజాగా జరగనున్న అమిత్ షా టూర్ పై తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్న ఆయన.. అక్కడ జరిగే జనగర్జన సభలో పాల్గొంటారు. అనంతరం 4.15 గంటలకు హెలికాఫ్టర్ లో హైదరాబాద్ కు వస్తారు. సాయంత్రం 5 గంటల వేళకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా.. 5.15 గంటలకు శంషాబాద్ నోవాటెల్ కు వస్తారు. ఇక్కడ 45 నిమిషాల పాటు అమిత్ షా టైంను రిజర్వు చేశారు.
ఆ 45 నిమిషాల్లో ఎవరితో భేటీ అవుతారు? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. ఇక.. 6.15 గంలలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిర్వహించే జనగర్జన సభలో మాట్లాడే అమిత్ షా.. 7.30 గంటల వేళలో శంషాబాద్ నొవాటెల్ కు చేరుకుంటారు. మళ్లీ.. మరో నాలుగు గంటల పాటు షెడ్యూల్ ను రిజర్వు చేశారు. ఈ టైంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు.