ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం. మరి ఇలా ఎలా జరిగింది, ఎవరు భాద్యులు, అమెరికా తెలుగు ప్రజలకు తెలుగు సంఘాలు మరియు రాజకీయపార్టీలు పై కలుగుతున్న భావాలేమిటి, ఇలాగే కొనసాగితే జరిగే పరిణామాలెలా ఉంటాయి అని పరిశీలిద్దాం.
అంతగా విశ్లేషణ అవసరంలేని, మనందరికీ తెలిసిన విధంగా ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లోని ముఖ్య పార్టీ లైన తెలుగుదేశం, వైసీపీ, టి ఆర్ ఎస్, బి జె పి, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీలు తమదైన సిద్ధాంతాలు, ఆశయాలకు తోడు కాలానుగుణంగాను, ప్రజలపరంగాను, మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా మానిఫెస్టోల, కార్యాచరణలు రూపొందించుకుంటాయి. వాటిని అమలుచేయడానికి, ప్రజల మద్దతు పొంది అధికారం చేజిక్కుంచుకోవటానికి అవసరమైన నాయకత్వం కొరకు, వనరులకొరకు, మేధోసంపత్తి కొరకు, ప్రచారంకొరకు, సంస్థాగతంగా బలపడటానికి గల మార్గాలను అనేక విధాలుగా అన్వేషిస్తుంటాయి. ప్రస్తుత గ్లోబల్ విలేజీ విధానం లో ఈ అవసరాల్లో ఎక్కువ భాగం అర్హతలున్న ఎన్ఆర్ఐల పై దృష్టి పెట్టటం సర్వసాధారణమైన విషయం. ఈ పరిస్థుతులు ఎటువంటి పరిణామాలు సృష్టించాయో అనేదే మనం విశ్లేషిస్తూ ఉన్న విషయం.
ఇక అమెరికా తెలుగు సంఘాల విషయానికి వద్దాం. అనేక దశాబ్దాలుగా తెలుగు వారు మంచి భవిష్యత్తుకై అమెరికాకు వలసరావటం మొదలైంది. ముందుగా ఎవరికి వారుగా ఉన్నప్పటికీ 1970 ల నాటికి న్యూయార్కు, టెక్సాస్, మిచిగాన్ మొదలైన ప్రదేశాలలో పెరిగిన తెలుగువారిలో మన భాష పై ఉన్న అభిమానంతోనూ, మిస్ అవుతున్న మన పండగలు, నాగరికత కొంతైన పొందాలని చిన్నచిన్నసంఘాలుగా ఏర్పడి కార్యక్రమాలను కొనసాగించారు. ఆ స్పూర్తితో ఇంకా అనేక ఇతర రాష్ట్రాలులోనూ, కెనడా లోను మరిన్ని సంస్థలు ఏర్పడి 1970 దశకం ద్వితీయార్ధంలో ఒక బలమైన సంకల్పంగా మారి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి, తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు, మరీ ముఖ్యంగా అన్ని ప్రాంతాలు, వర్గాల మధ్య ఐకమత్యానికై ప్రప్రధమంగా ‘తానా’ పేరుతొ అంతర్జాతీయ స్థాయి సంస్థ ఏర్పడింది.ఈ సంస్థ ఒక దశాబ్దం పైగా అనేక ప్రముఖ కార్యక్తమాలు నిర్వహిస్తూ గొప్ప గుర్తిపొందినప్పటికీ తదనంతరం కాలానుగుణంగా పెరుగుతున్న జనాభా మూలంగానూ, వేర్వేరు వర్గాల మధ్య ఏర్పడిన స్వల్ప విభేదాల వలన కొత్త జాతీయ సంస్థలు పుట్టటం మళ్ళీ ఇదే కారణాలతో వీటి నుంచే మరిన్ని సంస్థలు ఆవిర్భవించడం జరిగింది.ఇలా ఇప్పటికి తానా,ఆటా, నాటా, నాట్స్ ,టాటా, టీడీఫ్, ఆప్తా, న్రివా వగైరా వగైరా అనేక సంస్థలు ఉద్భవించగా, వీటిలో కొన్ని కులప్రాతిపదికగా, కొన్ని ఉద్యమ ప్రాతిపదికగా కూడా ఏర్పడ్డాయి. ఇవే కాక ఇంకా అనేకం జిల్లా ప్రాతిపదిక కూడా సంఘాలు ఏర్పడి ఆక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఏతా వాతా తెలుగు వారి సంక్షేమం దృష్ట్యా ఏర్పడిన ఈ సంస్థలను,తొలి నాళ్లలో చాలా మంది పెద్దలు ఎంతో అంకిత భావంతో నడిపి అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే ఆంధ్ర, తెలంగాణలలోనూ ప్రజాసంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టాయి.అయితే కాలక్రమేణా, జనం పెరిగే కొద్దీ మరింత పెరగాల్సిన ఐకమత్యం స్థానంలో రాజకీయం, పదవుల స్వార్థం, అధిపత్యంపై ఆరాటం ఎక్కువై సంకుచిత ధోరణులు పెరిగాయి. వీటిలోని చాలా సంస్థల్లో సంస్థ ఆశయాలు, సేవాభావం కంటే తమ వారి నాయకత్వం ఉండటమే ముఖ్యంగా ముఠాలు కడుతూ గాడ్ ఫాదర్ సంస్కృతి పెంచారు. ముఖ్యంగా కొద్దిమంది తమ పదవుల సమయం పూర్తి చేసిన తరువాత కూడా సలహాదారులుగా మాత్రమే ఉండకుండా ముఠాలు కడుతూ పట్టు నిలుపుకోవటము ఒక వ్యాపకంగా మార్చారు. ఏంతో చదువుకుని, గొప్పగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారు కూడా తమ స్థాయి మరచి ఎదో గుర్తింపు కొరకు పదవుల కొరకు ఈ ముఠాలకు దాసోహమవ్వటం తో పరిస్ధితులు మరింత దిగజారాయి.ఇంకా ఇంకా దిగజారుతున్నాయి.
ఇదే సమయంలో తెలుగురాష్ట్రాలలో జరిగిన అనేక మార్పులు, విభజనలు, కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, ఎన్నికలు, ఫలితాలు వగైరాలు సహజంగానే అమెరికాలోని తెలుగువారిలో కూడా అమితమైన ఆసక్తి, ఆలోచన కలిగించాయి. సరిగ్గా ఇదే సమయంలో రాజకీయ పార్టీల చూపులు అమెరికా తెలుగువారి ఆదరణకు, ఆసరాకై ప్రయత్నించాయి. ఎవరి ఇష్టానికి వారుగా మొదలై, ఇన్వొల్వెమెంట్ పెరుగుతూ పెరుగుతూ, గ్రూపులకు, తర్వాత కులాలకు, ఇంకా తర్వాత అమెరికా తెలుగుసంఘాలకూ కూడా అంటింది.ఇంతితై వటుడింతై అన్నట్టుగా, ఇది ఇంకా పెరిగి ఇక్కడి సంఘాలలో, ఎంతోకొంత పేరుతెచ్చుకున్నవారు అక్కడ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ భవిష్యత్తుకు అర్హతగా భావించుకోవటంతో రాజకీయ దురద ఉన్న ప్రతివాడికీ ఇది ఒక తెగులుగా తయారైంది. ఇక మాములు పదువులులలో ఉన్నవారికే ఇంత తెగులు వస్తే తెలుగు సంస్థ మొత్తం గుప్పిట్లో ఉన్నదని భావించేవారికి ఎంత అవకాశమో అనిపించక మానదు. తగినట్లుగానే, రాజకీయ పార్టీలు కూడా గుడ్డిగా నమ్మి, ఏదేదో ఆశించి అమెరికా సాధారణ తెలుగుప్రజల మనోభావాలు గమనించకుండా తెలుగుసంస్థలతో సంబంధాలు ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాయి.అదే అదనుగా ఈ వ్యక్తులు తెలుగుసంఘాల విద్యుక్త ధర్మాలను మర్చి సంఘాలకు ఉన్న పరపతిని, నాయకులకు ఉన్న స్థాయిని రాజకీయ పార్టీలకు ఇంచుమించు తాకట్టుపెట్టి తమదైన గుర్తింపుకై వెంపర్లాడారు. ఇదంతా గమనిస్తున్న సాధారణ ప్రజలకు,ఈ విపరీతాన్ని అరికట్టలేని సంఘ నాయకత్వాలపైనా, స్వలాభం చూపుతున్న వ్యక్తులపైనా, ఒకరకమైన ఏహ్యభావము ఏర్పడుతోంది.
ఇలా అమెరికా తెలుగు సంఘాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు మధ్య మొదలైన సంబంధాలు,అనేక మలుపులు తిరుగుతూ అక్కడా ఇక్కడా కూడా విపరీతమైన చర్చకు తావిచ్చాయి. వెరసి ఒక్కో సంస్థ ఒక్కో పార్టీకి గాని లేదా ఒక వర్గానికి గాని వత్తాసు పలుకుతున్నట్లుగా కనిపిస్తూ ఇతర వర్గాలను ఇటు సంస్థలకూ అటు రాజకీయపార్టీ లకు దూరంచేసి రెంటికీ చెడ్డ రేవడి గా మారటం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని భావించి,ఎన్ని సంఘాలు పెట్టినా, జైకొడుతున్న అమెరికాలోని తెలుగువారు, ఇప్పుడు తీవ్ర ఆందోళన, ఆవేదనలతో విరక్తి చెందుతున్నారు. దీనికి తోడు ఈ సంఘాలకు పెద్దలుగా భావించేవారు ఆయా రాజకీయపార్టీల పెద్దలుగా కూడా చలామణి అవుతూ, పార్టీలలో పదవులు పొందుతూ గాని, ఆశిస్తూగాని సంస్థల లోని ఇతర నాయకులను కూడా ఉసి కొల్పటం మూలంగా పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఏంతో గర్వపడే చరిత్రతో ఇతర సంఘాలకు తలమానికమైన అతి పెద్ద సంఘమైన ‘తానా’ నే ఈ విపత్కారానికి కూడా అతి పెద్ద ఉదాహరణ అనేది అందరికీ తెలిసిందే. ప్రతిగా మరిన్ని సంఘాలు మేమూ తక్కువకాదంటూ ‘తానా’ అంటే తందానా అన్నట్టు, ‘ఆటా’ అంటే పాటా అన్నటు తాళం వేస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం అన్ని సంఘాలు ఎవరికి వారుగా ఉండడం ఒక కారణమైతే,ఎవరి అజెండా, జండా వారిది కావడం మరో కారణంగా కనిపి స్తోంది. అజెండాల మాటున జరుగుతున్న అసలు సిసలు రాజకీయము కారణంగా అన్నీ కాకపోయినా దాదాపు ప్రతి తెలుగు సంస్థ ఇప్పుడు ఏపీ, లేదా తెలంగాణలోని ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా మారిపోయిందనే వ్యాఖ్య తరచుగా వినిపిస్తోంది.జరుగుతున్నఅనేక పరిణామాలు కూడా దీనిని ధ్రువపరుస్తున్నాయి. అన్ని వర్గాల, కులాల, ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యత, అనుబంధం కొరకు ఎర్పాటైన తెలుగుసంఘాలు,ఇప్పుడు అనైక్యతకూ, విద్వేషానికీ కారణవుతున్నాయేమోనన్న ఆందోళన రోజు రోజుకీ పెరుగుతోంది. ఇది ఇటు అమెరికా తెలుగు సంస్థలకు, అటు రాష్ట్ర రాజకీయ పార్టీలకు కూడా మాయానిమచ్చగాను, తీవ్ర నష్టంగానూ పరిణమించాయి. మరి ఈ పరిస్థితి మారాల్సిన అవసరం లేదా? అందరు తెలుగు వారికి అనుకూలంగా, ఆదరించే విధంగా వ్యవ హరించాల్సిన అవసరం సంస్థలకు మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఉందా లేదా? ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయకపోతే, వివిధ వర్గాల ప్రజల మధ్య ఆప్యాయత, అనుబంధాలు గాకుండా విద్వేషాలు, వివాదాలు రగుల్కునే ప్రమాదం కనిపిస్తోంది.
ఎవరికి వారు తమకు నచ్చిన రాజకీయపార్టీలకు తమ తమ వ్యక్తిగత హోదాలో పనిచేసుకోవటానికి హక్కు ఉన్నదేగాని, రాజకీయ పార్టీల్లో పదవులు గాని, ఇతర లబ్ది గాని పొందటానికి తమకు పలుకుబడిఉన్నసంఘాలకు, వాటిలోని నాయకులకు రాజకీయ దురద అంటించి స్వార్ధానికి బలిచెయ్యటం గర్హనీయం. అలాగే తెలుగు స్వచ్ఛంద సేవ సంస్థలకు, నాయకత్వం వహిస్తూ రాజకీయపార్టీలకు బహిరంగ మద్దతు తెలపటం అమెరికా చట్టాలప్రకారం కూడా నిషిద్ధం.అమెరికా తెలుగు ప్రజలు కోరుకుంటున్నవిధంగా,వివిధ రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా తెలుగు సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు, నాయకత్వం ఉన్నవారిని, పార్టీ పదవుల్లో, ముఖ్య కార్యక్రమాల్లో నియమించడం మానుకోవాలి. రెండు దేశాల్లో ఉన్న తెలుగువారి అవేదన, ఆలోచన గమనించి మలుచుకొంటే ఇటు అమెరికా తెలుగు సంఘాలకూ, అటు రాష్ట్ర రాజకీయ పార్టీలకు మరింత మేలు కలుగుతుంది.