జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి అంబటి రాంబాబుల మధ్య కొంతకాలం నుంచి మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్న భోగి సందర్భంగా సత్తెనపల్లిలో బంజారా మహిళలతో కలిసి రాంబాబు చేసిన డాన్స్ వీడియో పై మెగా బ్రదర్ నాగబాబు విమర్శలు గుప్పించారు. సంబరాల రాంబాబు పేరుకు తగ్గట్లుగానే డాన్స్ మాత్రం భలే చేశారంటూ సెటైర్లు వేశారు.
అయితే పోలవరం పూర్తి చేసి డాన్స్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అంటూ నాగబాబు విమర్శలు గుప్పించారు. అయితే, నాగబాబు కామెంట్లపై అంబటి రాంబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే, కానీ, ముఖానికి రంగు వేయను, ప్యాకేజీ కోసం డాన్స్ చేయను అని అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మరి, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా
మారింది.
ఇక, నాగబాబుపై వైసిపి మహిళా ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నాగబాబుకి బుర్ర లేదంటూ రోజా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని, ప్యాకేజి స్టారని రోజా విమర్శించారు. ఇక, నాగబాబు మనిషి ఎదిగారు కానీ బుర్ర ఎదగలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ రాజకీయాలకు పనికిరారని విమర్శించారు.