వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘాటుగానే స్పందించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు పవన్, జనసేన నేతలు కూడా అంతే ఘాటుగా రీ కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీటిపారుదల శాఖా మంత్రి అంబటిని ఉద్దేశించి జనసేన అఫీషియల్ ట్విటర్ అకౌంట్ నుంచి చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అయింది.
‘పోలవరం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తి అవుతుందో ఒక ‘అరంగంట’ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి?’ అంటూ జనసేన చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. గతంలో అంబటిపై అరగంట ఆరోపణలు రావడాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై జనసేన వేసిన సెటైర్ ఓ రేంజ్ లో పేలింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ట్వీట్ పై అంబటి రాంబాబు స్పందించారు. పవన్ నాలుగో పెళ్లి లోపు పూర్తి చేసే బాధ్యత తనది అంటూ ఆ ట్వీట్ కు అంబటి రీట్వీట్ చేశారు.
అంతకుముందు కూడా పవన్ పై అంబటి రాంబాబు కొద్ది రోజులుగా వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘యుద్ధం అన్నాడు.. సిద్ధం అన్నాడు. తిరిగి చూస్తే కనిపించడే’ అంటూ పవన్ పై అంబటి సెటైర్లు వేశారు. ‘‘అతనికి తిక్కుంది! దానికి బాబు దగ్గర లెక్కుంది !. జనసైనికులా ?, బాబు బానిసలా ?. యుద్దానికి సిద్ధం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్.. పిరికోళ్ళందరూ కలిసే రండి చూసుకుందాం!. ఒకే ఒక్క అసహనంతో నిన్ను నమ్ముకున్నవాళ్లందరినీ చెప్పుతో కొట్టావ్’’ అంటూ పవన్ పై అంబటి విమర్శలు గుప్పించారు.
‘‘ఇదీ.. నీ నిజస్వరూపం…నీ ప్యాకేజ్ ఊపులకి ఉడతలు కూడా జడవవు! చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి వైసీపీని దించుతానంటావు కానీ నేనే గద్దెనెక్కుతాననలేవు ! నువ్వు ఒక నాయకుడివి ? నీదొక రాజకీయ పార్టీనా ?’’ అంటూ పవన్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అరగంట అంటూ అంబటిపై జనసేన ట్వీట్ చేసింది.