నిన్న ప్రగల్భాలు
నేడు పరారీ ???? pic.twitter.com/9gvdDgqtsm— Anitha Vangalapudi (@Anitha_TDP) August 1, 2022
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రులకు.. వైసీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే పనిగా సంక్షేమ పథకాల పేరుతో.. లబ్థిదారుల ఖాతాల్లో డబ్బులు వేసిన వేళ.. తమకు తిరుగు ఉండదన్నట్లుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ అంచనాలకు భిన్నంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న వైనం ఇటీవల నిర్వహిస్తున్న ప్రోగ్రాం పుణ్యమా అని తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయా? అంటూ ప్రశ్నించిన మరుక్షణం.. వారి నుంచి వస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ నేతలు కంగుతింటున్నారు. దీంతో.. కొందరు వైసీపీ నేతలు బ్యాలెన్సు మిస్ అయి.. చేస్తున్నవ్యాఖ్యలు పార్టీకి.. ప్రభుత్వానికి మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. తాజాగా.. మంత్రి అంబటి రాంబాబు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు మరింత ఆగమయ్యేలా మారినట్లు చెబుతున్నారు.
తాజాగా పల్నాడు జిల్లాలోని రాజుపాలెంలో మంత్రి అంబటి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అన్న ప్రశ్నకు ఆయనకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానాలు వస్తున్నాయి. వారి మాటలు విని ఇరిటేట్ అయిన ఆయన.. ఆగ్రహంతో చేస్తున్న వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అయ్యేలా మారాయి. ఫించన్ కోసం దరఖాస్తు చేసుకొని మూడేళ్లు అయినా తనకు రాలేదని ఒక దివ్యాంగురాలు మంత్రిని నిలదీయగా.. వారి ఇంటికి నాలుగు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అందుకే ఇవ్వలేదని పేర్కొన్నారు.
దీంతో.. అంబటి మారు మాట్లాడకుండా ముందుకు వెళుతుంటే.. దివ్యాంగురాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతలోనే అక్కడకు సమీపంలోని మరో వ్యక్తి సైతం జగన్ సర్కారు మీదా.. మంత్రి అంబటి మీదా ఘాటు విమర్శలు చేశారు. దీంతో మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చినట్లుగా చెబుతున్నారు. దీన్నంతా రికార్డు చేస్తున్న మీడియాను.. సదరు వ్యక్తి మాటల్ని డిలీట్ చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ సందర్భంగా అంబటి అనుచరులు బలవంతంగా డిలీట్ చేశారన్న ఆరోపణ వినిపిస్తోంది.
ఇలా.. అంబటి పర్యటన మొత్తం ఆగమాగం అన్నట్లుగా సాగటం.. అదే సమయంలో రాజుపాలెంలోని మరో ప్రాంతంలో పర్యటించే సందర్భంలో మంత్రి అంబటిని ఉద్దేశించి.. ఒక వ్యక్తి రోడ్లు కావాలని అడగ్గా.. మంత్రి పక్కనున్న వారు అతను తెలుగుదేశం పార్టీ అభిమాని అని పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీంతో స్పందించిన మంత్రి అంబటి.. మీరు తెలుగుదేశమా? వారికి రోడ్లు ఎలా వేస్తామని చెప్పి వెళ్లిపోయిన వైనం ఇప్పుడు కొత్త రచ్చకు కారణమైందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిసేసరికి..అంబటి వారు ఆగమాగం అయ్యేలా ఉన్నారన్న మాట వినిపిస్తోంది.