గత నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల దెబ్బకు విజయవాడ నగరం నీట మునిగింది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో విజయవాడ తల్లడిల్లుతోంది. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు నుంచి వరద ముప్పు ముంచుకొస్తుండటంతో అక్కడి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు విజయవాడకు అమావాస్య గండం కూడా పట్టుకుంది.
అమావాస్య కావడం వల్ల సముద్రం పోటు మీద ఉంది. పోటు మీదుంటే సముద్రం వరద నీటిని తనలోకి ఇముడ్చుకోదు. వరద జలాలు సుముద్రంలో కవలకపోతే ముంపు ప్రాంతాలకు ముప్పు మరింత పెరిగిపోతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరిపోయింది. ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ఇప్పుడు ఎగువ నుంచి భారీ వరద నీరు.. దిగువ సముద్ర పోటుతో పరిస్థితులు మరెంత ఆందోళనకరంగా మారతాయో అని అందరూ హడలెత్తిపోతున్నారు.
అయితే ఈ రోజు 12 గంటల తర్వాత అమావాస్య గడియలు ముగుస్తాయి. దాంతో సముద్రం సాధారణ స్థితికి రానుందని.. ఎదుగ నుంచి పోటెత్తుతున్న వరద తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్ఫ్లో ఈసారి నమోదు అవుతోంది. ఇప్పటికే వరద నీరు 11 లక్షల క్యూసెక్కులు దాటి పోయింది. అధికారులు బ్యారేజీ 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఇలాంటి సమయంలో అమావాస్య గండం తలెత్తడంతో.. సమీప గ్రామాలను ముంపు భయం వణికిస్తోంది.