కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి బీజేపీ ఎలాంటి ప్రయత్నాలూ ప్రత్యేకంగా చేయనవసరం లేదనిపిస్తోంది.
కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న సోనియాగాంధీ ఆశలు ఇప్పట్లో తీరేలా ఏమాత్రం కనిపించడం లేదు.
ఎన్నోకొన్ని లోక్ సభ సీట్లు వచ్చే పంజాబ్‌లో కూడా కాంగ్రెస్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉన్న ముఖ్యమంత్రి అమరీందర్‌ను కాదని సిద్దూకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
తాజాగా ఆయన ఏకంగా పంజాబ్ విషయంలో అధిష్ఠానం ఎక్కువ జోక్యం చేసుకుంటోందని కూడా అనేశారు.
ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ఆయన కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టబోతున్నారని దిల్లీ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
సీఎంగా కెప్టెన్ అమరీందర్‌ను కొనసాగిస్తూనే, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు సిద్దూకు అప్పజెప్పాలని అధిష్ఠానం నిర్ణయించడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిప్పులు గక్కుతూ అధినేత్రి సోనియా గాంధీకి శుక్రవారం ఓ లేఖ రాశారు.
పంజాబ్ విషయంలో అధిష్ఠానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని తీవ్రంగా దుయ్యబట్టారు.
పంజాబ్‌లో పరిస్థితి అంత అనుకూలంగా ఏమీ లేదని లేఖలో పేర్కొన్నారు.
అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అధిష్ఠానం వ్యవహార శైలితో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
పార్టీలోని సీనియర్లను తక్కువగా అంచనా వేయవద్దని, అలా తక్కువగా అంచనా వేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందని సీఎం అమరీందర్ సింగ్ ఆ లేఖలో కుండబద్ధలు కొట్టారు.
అమరీందర్ సింగ్ కనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఆయన వర్గం మొత్తాన్ని కాంగ్రెస్ కోల్పోవాల్సి ఉంటుంది.
దీంతో వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలలోనూ అధికారం అందుకోవడం కాంగ్రెస్‌కు కష్టమవుతుంది.
117 అసెంబ్లీ సీట్లు ఉన్న పంజాబ్ శాసనసభకు 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలుచుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ 20, శిరోమణి అకాలీదళ్ 15 స్థానాలు సాధించాయి.
2017 వరకు అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌ను 15 స్థానాలకు పరిమితం చేయడం 31 సీట్ల నుంచి కాంగ్రెస్ బలం 77 సీట్లకు పెంచుతూ అధికారం దక్కించుకోవడం వెనుక అమరీందర్ కృషి, చరిష్మా తప్ప వేరే కారణాలేవీ లేవన్నది సత్యం.
అంతటి చరిష్మా ఉన్న అమరీందర్‌ను కాదని సిద్దూకి ప్రాధాన్యం ఇస్తున్న సోనియా కుటుంబం అందుకు తగ్గ మూల్యం చెల్లించకతప్పదని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.
అమరీందర్ కొత్త పార్టీ పెడతారని బలంగా వినిపిస్తుండంతో పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోయినట్లేనన్న మాటా వినిపిస్తోంది.