పంజాబ్ రాజకీయాలలో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీపీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా కెప్టెన్ రాజీనామా చేయగా…మధ్యే మార్గంగా చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్.
అయితే, కాంగ్రెస్ హై కమాండ్ పై అసంతృప్తితో ఉన్న కెప్టెన్…ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవబోతున్నారని, అన్నీ సెట్టయితే కెప్టెన్ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సిద్దూ తన పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ విషయంలో రాజీపడబోనని, అందుకే రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్ అధిష్టానానికి సిద్ధూ రాసిన రాజీనామా లేఖ పెను దుమారం రేపుతోంది.
కానీ, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని సిద్ధూ స్పష్టం చేశారు. సిద్ధూ 72 రోజుల క్రితం పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుకూల వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న కారణంతోనే ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు కెప్టెన్ బీజేపీలో చేరే ఆలోచనకు సిద్దూనే కారణమని పంజాబ్ కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సిద్ధూ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా సిద్ధూ రాజీనామాపై కెప్టెన్ అమరీందర్ సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. సిద్ధూకు నిలకడలేదని తాను ముందే చెప్పానని కెప్టెన్ ట్వీట్ చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిద్ధూ దేశానికి ప్రమాదకారి అంటూ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
మరోవైపు, సిద్ధూ రాజీనామా, కెప్టెన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఢిల్లీలో హైడ్రామా ఏర్పడింది. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీలో అత్యవసరంగా భేటీ అయ్యారు.