- సచివాలయం, హైకోర్టుకు వెళ్లే రహదారులూ తవ్వేస్తున్న వైనం
- ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో స్థానిక వైసీపీ నేతల నిర్వాకం
- ఇన్సైడర్ ట్రేడింగ్ వట్టిదేనని సుప్రీంకోర్టు తేల్చినా మారని వైఖరి
- అసైన్డ్ భూములు కొన్నవారికి నోటీసులు
- రిటర్నబుల్ ప్లాట్ల రద్దుకు హెచ్చరికలు
https://www.youtube.com/watch?v=KJ6DdYNswyg&ab_channel=ApVarthalu
రాజధాని అమరావతిపై సీఎం జగన్మోహన్రెడ్డికి ఇంకా కక్ష తీరినట్లు లేదు. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపివేసి.. పూర్తికావచ్చిన భవనాలు, ఉద్యోగుల క్వార్టర్లను ఆపేసి.. వాటిని పాడుపెట్టడంతో సరిపెట్టడం లేదు. ఇప్పుడు ఏకంగా అభివృద్ధి ఆనవాళ్లే కనిపించకుండా చేయాలని, నిజంగా శ్మశానం చేయడానికే కంకణం కట్టుకున్నారని రాజధాని ప్రాంతవాసులు మండిపడుతున్నారు.
ఇది వరద ముంపు ప్రాంతమని.. భూకంపాలు వస్తాయని రాజధానికి పనికిరాదని.. సీఎం సొంత మీడియాలో పారాయణం చేస్తూనే ఉన్నారు. భూకుంభకోణం బుర్రకథ ఉండనే ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణ చేశారు. షేర్ మార్కెట్లో ప్రధానంగా జరిగే ఈ అక్రమాన్ని రాజధాని భూకొనుగోళ్లకు ఆపాదించి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ ఆరోపణ ట్రాష్ అని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తేల్చిచెప్పాయి. ప్రైవేటు వ్యక్తుల మధ్య భూలావాదేవీలు జరిగితే ప్రభుత్వానికి ఏం నష్టమని నిలదీశాయి. తమకు నష్టం జరిగిందని అమ్మకందారులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశాయి.
ప్రజావేదికతో కూల్చివేతతో మొదలుపెట్టిన అమరావతి విధ్వంసం.. తాజాగా ఐకాన్ బ్రిడ్జి ఆర్చ్ తొలగింపు వరకు చేరుకుంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణం చేసిన సీడ్ యాక్సిస్ రోడ్డు సహా పలు రహదారులను ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో స్థానిక వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. తారు-కంకర, ఇసుకను బహిరంగంగా ట్రాక్టర్లలో వేసుకుని తీసుకెళ్తున్నారు.
వెలగపూడి సచివాలయం, హైకోర్టులకు వెళ్లే రహదారులనూ వదిలిపెట్టడం లేదు. ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. సచివాలయం వెనుక తవ్వేసి ఇసుక తీసుకుపోతున్నారు. సాక్షాత్తూ హైకోర్టు పక్కనే తవ్వడం చూస్తుంటే ఇది కచ్చితంగా కావాలని చేస్తున్న దుష్కృత్యమేనని చెప్పకతప్పదు.
రుజువు చేయలేక..
జగన్ అధికారంలోకి వచ్చాక అధికారులను బెదిరించి దీనిని రుజువు చేయాలనుకున్నారు. వారెవరూ ముందుకురాకపోవడంతో మంత్రులు, ఎంపీలతో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అటు కెలికీ.. ఇటు కెలికీ 4 వేల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఆ కమిటీ చెప్పింది. కానీ అదేమి అక్రమమో రుజువుచేయలేకపోయింది.
భూకొనుగోళ్లు, విక్రయాలపై ఐటీ, ఈడీలకు ప్రభుత్వమే సమాచారమిచ్చింది. రైతుల బ్యాంకు ఖాతాలను సైతం పంపింది. వాటిపై అధికారులు రహస్యంగా విచారణ జరిపారు. ఎక్కడా అక్రమం కనిపించకపోవడంతో ఆ విషయమే ప్రభుత్వానికి చెప్పి నిష్క్రమించాయి.
రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా.. దానినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రాజధాని అమరావతిపై బురజల్లడం జగన్‌కు, ప్రభుత్వ పెద్దలకు పరిపాటిగా మారింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ మధ్య అసైన్డ్ భూముల వ్యవహారంలో అడ్డగోలు ఆరోపణలు చేశారు.
దళితులను బెదిరించి భూములు కొన్నారని.. తన వద్ద వారు మొరపెట్టుకున్నారని.. దీనిపై సీఐడీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన చెప్పిన దళితులే ఆయనపై మండిపడ్డారు. స్వచ్ఛందంగానే తాము భూములిచ్చామని కొందరు చెప్పగా.. మరికొందరికి అక్కడ భూములే లేవు. అబద్ధాల ప్రచారంలో ఆళ్ల అందెవేసిన చేయిగా మరోసారి రుజువు చేసుకున్నారు.
దుస్సాహసం..
అమరావతి వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టడానికి సీబీఐ నిరాకరించడంతో సీఐడీని జగన్ రంగంలోకి దించారు. రాజధానిని ప్రకటించకముందే భూములు కొన్నారంటూ కొందరిపై కేసులు నమోదుచేయించారు. రాజధాని ప్రాంతానికి ఎక్కడో దూరంగా ఉన్న కంచికచర్లలో భూమి కొన్నారని సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెపైనా కేసుపెట్టారు. దీనివెనుక పెద్ద కారణమే ఉంది.
ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిరుడు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటున్న తననే ఆయన టార్గెట్ చేశారని భావించిన ఆయన.. మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ సాయంతో.. జస్టిస్ రమణ, నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కొందరు న్యాయమూర్తులపైన ఆరోపణలు చేస్తూ అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు.
ఇది న్యాయ వర్గాల్లో కలకలం రేపింది. ఎలాగైనా జస్టిస్ రమణ పేరును, ఆయన కుటుంబాన్ని భూముల కొనుగోలు వ్యవహారంలో ఇరికించేందుకు జగన్ చేయని ప్రయత్నమంటూ లేదు.
రాజధానిలో భూములు కొన్నారంటూ టీడీపీ నేతలను, వారి బంధువులను బెదిరించడానికి, వారిని జైలుకు పంపడానికి పది మంది పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటుచేశారు. అదీ ఏమీ తేల్చలేకపోయింది. సీబీఐ కూడా దర్యాప్తునకు అంగీకరించకపోవడంతో తన తాబేదార్లు ఉన్న సీఐడీని అడ్డుపెట్టుకుని జగన్ నాటకమాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అసైన్డ్ భూములు కొన్నారని..
అమరావతిలో తాజాగా మరో కలకలానికి ప్రభుత్వం తెర తీసింది! రాజధానిలోని అసైన్డ్ భూములను ‘అక్రమంగా’ కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని పూలింగ్‌కు ఇచ్చి, బదులుగా రిటర్నబుల్ ప్లాట్లను పొందిన వారికి సదరు ప్లాట్ల కేటాయింపును ఎందుకు రద్దు చేయరాదో తెలియజేయాలంటూ ఏఎంఆర్డీఏ (పూర్వపు సీఆర్డీఏ) ద్వారా నోటీసులు పంపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీపై నిషేఽధాజ్ఞలు) చట్టం-1977 ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు నేరమని, అయినప్పటికీ వాటిని కొనుగోలు చేసినందున రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంటోంది. రిటర్నబుల్ ప్లాట్లను పొందిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకుని, వాటిని అసలైన అస్సెన్డ్ రైతులు లేదా వారి వారసులకు అందజేస్తామంటోంది!
తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలోని పట్టా రైతులతోపాటు నిరుపేద అసైన్డ్ రైతులకు సైతం లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో వారికీ భూసమీకరణ కింద ప్యాకేజీని ప్రకటించింది. ఈ భూములకు ఎకరానికి 600 చదరపు గజాల (నివాస- 500 చ.గ., వాణిజ్యం- 100 చ.గ.) చొప్పున ప్లాట్లు ఇస్తామని చట్టబద్ధంగా ప్రకటన చేసి, తదనుగుణంగానే రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించింది.
ఇలా ఈ ప్లాట్లను పొందిన అసైన్డ్ రైతుల్లో కొందరు వాటిని తమ అవసరాల నిమిత్తం ఇతరులకు అమ్ముకున్నారు. ఇంకొందరు మాత్రం తాము సాగు చేసుకుంటున్న భూములను పూలింగ్ కింద సీఆర్డీఏకి ఇచ్చే ముందే అమ్మేసుకున్నారు. వాటిని కొనుగోలు చేసిన వారు వాటిని సీఆర్డీఏకిచ్చి, బదులుగా రిటర్నబుల్ ప్లాట్లను పొందారు. తాజా నోటీసుల కారణంగా ఈ రెండవ తరహా వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. వారిలో పలువురు ఈ నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలని భావిస్తున్నారు.
సుప్రీం కోర్టు సైతం చెప్పినా..!
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధానిగా అమరావతి ప్రకటన సహా దానికి సంబంధించిన పలు అంశాల్లో లెక్కలేనన్ని అక్రమాలు, నియమోల్లంఘనలు జరిగాయంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా పెద్దఎత్తున దుష్ప్రచారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగిలినప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు అమరావతిపై ఆధారరహితంగా విషం కక్కడాన్ని మానేస్తారు. కనీసం కొన్నిరోజులైనా నోరెత్తరు.
కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభృతులు మాత్రం ‘నవ్విపోదురు గాక..’ అనే సామెత తరహాలో.. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత సైతం తమ ధోరణిని మార్చుకోకుండా, అమరావతిలో ఎన్నెన్నో అక్రమాలు జరిగాయని, అవన్నీ త్వరలోనే బయట పడతాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. అమరావతిలోని వివిధ గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల క్రయ విక్రయాల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్న అనుమానాలు, అపోహలకు తావిచ్చేలా నోటీసుల పర్వానికి ప్రభుత్వం తెర తీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరకట్టను బలహీనపరిచేలా తవ్వకాలు
రాజధానిగా అమరావతిని ఉనికిలో లేకుండా చేసే కుట్రలను జగన్ ప్రభుత్వం ఆపడం లేదు. దానిని ముంపు ప్రాంతంగా చిత్రించే కుతంత్రాలు పై స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని గ్రామం తాళ్లాయపాలెం పక్కనే కృష్ణా నది కరకట్టకు ఆనుకుని.. డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను డంపింగ్ చేయడానికి కోల్‌కతాకు చెందిన ఓ బడా కంపెనీ పనులు మొదలు పెట్టింది.
నదిలోకి డ్రెడ్జింగ్ యంత్రాలను దించింది. ఇసుకతో పాటు వాటర్ కూడా డంపింగ్లోకి వచ్చి పడతాయి. ఆ నీటిని మళ్లీ నదిలోకే పంపడానికి కరకట్టను ఆనుకుని కాలువలు తీశారు. తద్వారా కరకట్ట బలహీనపడితే కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో రాజధాని గ్రామాల్లోకి నీరు చేరుతుంది.
దీంతో ముంపు ప్రాంతమని తాము చెప్పిందే నిజమని చూపించే విధంగా.. కావాలనే డ్రెడ్జింగ్ పనులను ప్రభుత్వం సదరు కంపెనీకి అప్పజెప్పిందని రాజధాని రైతులు మండిపడుతున్నారు ‘కాలువలు తవ్వితే కరకట్ట బలహీనపడుతుంది. రూ.వందల కోట్లతో కరకట్టను పటిష్ఠం చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడా ఊసే లేకుండా బలహీనపరిచే కుట్ర జరుగుతోంది.
భారీ యంత్రాలతో లోతుగా డ్రెడ్జింగ్ చేస్తే భవిషత్లో భూకంపాలు వస్తాయి. అప్పుడు అమరావతిలో కట్టడాలు క్షేమం కాదని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఇసుక డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా రైతుల భూముల్లో డంపింగ్ పనులు ఎలా చేపడతారు’ అని ప్రశ్నిస్తున్నారు. తమ భూములను అభివృద్ధి చేయకపోగా నాశనం చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ధ్వజమెత్తుతున్నారు.