అమరావతే ఏపీ రాజధాని అని 6 నెలల క్రితం ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయలేదు. కానీ, తాజాగా అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0, అసెంబ్లీలో మూడు రాజధానులపై వాడీవేడి చర్చలు జరుగుతున్న తరుణంలో ఆ తీర్పును సుప్రీం కోర్టులో వైసీపీ ప్రభుత్వం సవాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.
అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమ విజయం న్యాయానిదేనంటూ నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ అంటే జగన్ కు అర్థం తెలీదని, వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచడం వికేంద్రీకరణ అనుకుంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ విజ్ఞతకు, వివరణకు, విజన్ కు పెద్ద నమస్కారం అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. వికేంద్రీకరణపై జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ గా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. హైకోర్టులో వచ్చిన తీర్పే సుప్రీంకోర్టులోనూ వస్తుందని, అక్కడ కూడా జగన్ సర్కారుకు మరోసారి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.
చట్టసభలను తక్కువ చేసేలా హైకోర్టు తీర్పు ఇవ్వలేదని, దురుద్దేశంతోనే కోర్టు తీర్పును వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు ఆగి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ తీర్పును సవాల్ చేయడం ఏమిటని నిలదీశారు.
ఇక, ఈ వ్యవహారంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా స్పందించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను సుప్రీంకోర్టు కాదనదని, అమరావతి రైతుల పోరాటం వృథా కాదని పయ్యావులు అన్నారు. సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల సంకల్పం ముందు ప్రభుత్వ కుట్రలు చాలా చిన్నవని పయ్యావుల అన్నారు.