నవ్యాంధ్రలో తొలి ఉద్యమంగానే కాదు, బహుశా నవ్యాంధ్ర చరిత్రలో ఇపుడు, రాబోయే కాలంలో కూడా అమరావతి ఉద్యమమే సుదీర్ఘ ఉద్యమంగా నిలవనుంది. ఆరు కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని నిర్మిస్తాం అని ప్రభుత్వం పిలుపును ఇస్తే… తమ భూభాగంలో 3వ వంతును ఏపీ ప్రజలకు రాసిచ్చేశారు అమరావతి రైతులు. ఇది భారతదేశ భూసేకరణ చరిత్రలోనే ఒక అరుదైన అధ్యాయం. నిజానికి వారు సృష్టించిన చరిత్ర ఎన్నటికీ గుర్తుంచుకోదగినది. ఒక రోల్ మోడల్. కానీ దానిని చరిత్ర పేజీల నుంచి చింపేయడానికి కంకణం కట్టుకున్నది ఏపీ సర్కారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు.
రాజధానికి భూమిలస్తే ఆరు కోట్ల ఆంధ్రులు మాతోపాటు ఉజ్వల భవిష్యత్తు పొందుతారు అని సదుద్దేశంతో భూములు ఇచ్చిన రైతులకు శఠగోపం పెట్టి రాజధానిని తరలించడానికి ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొదలైన అమరావతి పరిరక్షణ ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. వారి ఉద్యమానికి అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది. వారికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
భూములు ఇచ్చిన రైతులకు అండగా చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రమంతటా ”అమరావతి పరిరక్షణ సంఘీభావ ర్యాలీలు” జరపాలని సూచించారు. రాత్రి పూట నిరసన దీపాలు వెలిగించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మార్వో ఆఫీసుల ముందు ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే, కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఇవన్నీ చేయాలన్నారు.
మూడు రాజధానులు పేరిట వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని నిప్పులు చెరిగారు. వైజాగ్ మీద ప్రేమ ఒలకబోసే వైసీపీ ప్రభుత్వం ఈ పదహారు నెలల్లో ఏమీ చేసిందంటూ ప్రశ్నించారు. అధికారం లోకి వచ్చిన ఏడాదిన్నరలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్ కి ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు.