కీలక తీర్పును ఏపీ హైకోర్టు వెలువరించింది. ఏపీ రాజధానిగా అమరావతి.. మూడు రాజధానులకు సంబంధించిన దానిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి తెలిసిందే. ఇలాంటి వేళ.. రాజధాని ప్రాంత అభివ్రద్ధి ప్రాధికార సంస్థ రద్దు పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తాజాగా వెలువరించిన తీర్పు ప్రకారం రాష్ఠ్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధానంపై న్యాయస్థానం స్పష్టం చేసింది.
తాజా తీర్పు ప్రకారం.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలన్న ఆదేశాల్నిజారీ చేసింది. అంతేకాదు.. డెవలప్ మెంట్ పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కీలక తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.
తాజా తీర్పులో భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలను డెవలప్ చేసిన ప్లాట్లను అప్పగించాలని పేర్కొంది. అంతేకాదు.. ఈ భూములను రాజధాని అవసరాలకు తప్పించి ఇతరత్రా విషయాలకు ఈ భూములను తనఖా పెట్టటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇంతకూ ఈ కేసులేంది?
హైకోర్టు తీర్పు ఏమిటన్న విషయంలోకి వెళితే.. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ.. అందుకు తగ్గట్లు ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సదరు సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి.. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
దీంతో.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే తాము తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టాలను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినప్పటికీ.. తాము దాఖలు చేసిన పిటిషన్లలోని అభ్యర్థనలు మిగిలి ఉన్నాయని.. వాటిపై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు.
ఈ సందర్భంగా సీఆర్డీఏ చట్టాన్ని.. దాని స్ఫూర్తిని కోర్టుకు చెబుతూ.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్లాట్లు ఇవ్వాలని..రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని కోరుతూ వాదనలు వినిపించారు.
తాజాగా ఈ వాదనల్ని ముగిసి.. తమ తీర్పును వెలువరించిన హైకోర్టు ధర్మాసనం తమ తీర్పును స్పష్టంగా వెల్లడించింది. దీని ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాలని.. అందులో పేర్కొన్న విధంగా హామీల్ని పూర్తి చేయాలని చెప్పటంతో పాటు..రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది.
అంతేకాదు.. అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలని.. మూడు నెలల్లో వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించి.. ఆర్నెల్లలోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని.. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరన్నారు.
అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని.. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని.. పిటిషనర్లు అందరికి ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున ప్రభుత్వం చెల్లంచాలని ధర్మాసనం పేర్కొంది. అమరావతిని రాజధానిగా పేర్కొంటూ పోరాటం చేసిన రైతులకు ఇదో చక్కటి ఉపశమనంగా చెప్పక తప్పదు. మరి.. ఈ తీర్పుపై ప్రభుత్వ స్పందన ఏమిటన్నది చూడాలి.