సీఎం జగన్ పదవి చేపట్టిన వెంటనే నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ జగన్ కొత్త పల్లవి అందుకోవడంతో తమ కలల రాజధానికి వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కడుపు మండింది. ఆ కడుపుమంటతోనే కదం తొక్కిన రైతన్నలు…పోరు బాట పట్టారు. పలుగు పార పట్టిన చేతులతోనే ఉద్యమ బ్యానర్లు, జెండాలు పట్టారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు ఉద్యమ స్ఫూర్తికి జగన్ సైతం తలవంచక తప్పలేదు.
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. అయితే, హైకోర్టు తీర్పుతోపాటు అమరావతి రైతుల ఆకాంక్షలను పట్టించుకోని జగన్…ఆ తీర్పును అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమ ఉద్యమాన్ని అమరావతి రైతులు జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు.
అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రైతులు ఢిల్లీలో ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో 1600 మంది రైతులు పాల్గొన్నారు. అమరావతి పరిసర గ్రామాల నుంచి రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లారు. అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగనుంది. ఈ ధర్నాకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ ఎంపీ హనుమంతయ్య, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తోపాటు పలు రాజకీయాల పార్టీల నేతలను రైతులు ఆహ్వానించారు.
దీంతో, రాజధాని రైతుల నిరసనకు టీడీపీ, జనసేన, టీడీపీ, సీపీఐ నేతలు, పలు రైతు సంఘాల నాయకులు మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, జనసేన నేత హరిప్రసాద్, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు జంతర్ మంతర్ కు వెళ్లి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారు. సోమవారంనాడు రామ్ లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో అమరావతి రైతులు పాల్గొనబోతున్నారు. అమరావతి రైతు ఉద్యమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రత్యేక అజెండాగా చేర్చింది.