తమ భూముల్లో రాజధాని నిర్మాణం చేస్తామంటే ఎన్నో ఆశలతో ఆ రైతులు భూములిచ్చారు. కానీ ప్రభుత్వం మారగానే.. నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆపేసి.. ఒక్క రాజధానికి కాదు.. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల జీవితాలను ఆగం చేస్తూ వాళ్ల పాలిట అన్యాయంగా ప్రవర్తిస్తూ సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను అధికార వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడీ చట్టాలకు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చకపోవడం చట్ట విరుద్ధమని ఒకవేళ ఈ ఒప్పందం నుంచి ప్రభుత్వం తప్పుకోవాలనుకుంటే గతంలో భూములు ఎలా ఉండేవే ఇప్పుడు అలాగే అప్పగించాలని కోరారు. తగిన పరిహారం కూడా చెల్లించాలని తెలిపారు.
సీఆర్డీఏ చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ సత్యనారాయాణ మూర్తి, జస్టిస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయిదో రోజు విచారణలో భాగంగా పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. అమరావతికి భూములిచ్చిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని తెలిపారు.
భూములిచ్చిన రైతులకు రాజధాని అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని చెప్పి చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. రైతులిచ్చిన వేల ఎకరాలకు తానే యజమానిని అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాజధాని నిర్మాణం చేయం కానీ భూములు ఉంచుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం శాసనాధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ ఈ చట్టాలను చేశారని, ప్రతి దశలోనూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని వాదించారు.
రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను నవరత్నాలు పథకాలకు ఉపయోగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చకపోవడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ ఒప్పందం నుంచి ప్రభుత్వం వైదొలగాలంటే.. రైతులు భూములు గతంలో ఎలా ఉండేవో ఇప్పుడు అలాగే మళ్లీ వాళ్లకు అప్పగించాలని, పరిహారం చెల్లించాలని కోరారు.
సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను పాస్ చేసే క్రమంలో ప్రభుత్వం సభా నిబంధనలను ఉల్లంఘించిందని మరో సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం కోసం పంపే బిల్లులపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ సంతకం తప్పనిసరి కానీ ఛైర్మన్ సంతకం లేకుండానే వాటిని గవర్నర్కు రాజ్యాంగాన్ని వంచించడమేనని చెపన్పారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.