ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా పొరుగురాష్ట్రాలకు తరలిపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఏపీలో ఉన్న కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పెట్టెబేడె సర్దుకొని వెళ్లిపోతుంటే….మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పాలనా రాజధాని విశాఖ కొత్త కంపెనీలతో విరాజిల్లుతోందంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కొత్త కంపెనీల మాట దేవుడెరుగు…కనీసం ఆల్రెడీ ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా కాపాడుకోలేని స్థితిలో జగన్ సర్కార్ ఉందంటే అతిశయోక్తి కాదు.
కేవలం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను దెబ్బకొట్టేందుకు ఆయన ఎండీగా, ఛైర్మన్ గా ఉన్న అమరరాజా బ్యాటరీస్ పై జగన్ కక్ష సాధించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, చిత్తూరులో ఆ సంస్థ విస్తరించాలనుకున్న ‘అడ్వాన్స్ డ్ లిథియం టెక్నాలజీ రీసెర్చ్ హబ్’ తమిళనాడుకు తరలిపోవడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. ఏపీలో తమకు ఎదురువుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే 2వ అతిపెద్ద సంస్ధ అయిఉండి, 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ అమరరాజా యజమాని ఏపీ కి చెందిన వ్యక్తి అయి ఉండి ఆ సంస్థ.ఏపీ నుంచి తమిళనాడుకు తరళివెళితే అది కచ్చితంగా జగన్ అసమర్థ పాలన వల్లే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే అమరరాజాకు చెందిన మరో యూనిట్ తాజాగా తెలంగాణకు తరలిపోయింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్ ను తెలంగాణ ఏర్పాటు చేసేందుకుగాను అక్కడి ప్రభుత్వంతో అమర రాజా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది.
దాదాపు 9500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ యూనిట్ ఏర్పాటుకు అమర రాజా సంస్థకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఎంఓయు కుదిరింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అమరరాజా సంస్థ చైర్మన్, ఎండీ, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు. భారతదేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను తెలంగాణలో అమర రాజా సంస్థ నెలకొల్పుతున్నందుకు గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమర రాజా సంస్థను గతంలో ప్రభుత్వం కోరిందని, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాదులో పెట్టుబడులు పెడుతున్నామని గల్లా జయదేవ్ తెలిపారు.