భాషలతో సంబంధం లేకుండా.. ఏ వుడ్ అయినా సరే తన సత్తా చాటే నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. గ్లామర్ తో పాటు గ్రామర్ ఉన్న హీరోయిన్ గా పేరున్న అమలాపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయానికి వెళ్లిన ఆమెకు అక్కడి అధికారులు దైవ దర్శనానికి నో చెప్పారు.
ఆమె అన్యమతస్తురాలు అంటూ ఆమెను గుడిలోకి అనుమతించని వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది. దీంతో అసహనానికి గురైన ఆమె.. గుడి రిజిస్టర్ లో తన ఆవేదనను పేర్కొని తిరిగి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.
తాను గుడికి వెళితే ఎదురైన అనుభవం గురించి తాజాగా బయటపెట్టిన ఆమె.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ కాకపోవటంతో ఆలయ అధికారులు తనను గుడిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. కేరళలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. 2023లో కూడా మతపరమైన వివక్ష ఉండటం ఏమిటి? అంటూ ఆమె సూటి ప్రశ్న వేశారు.
తాను దైవం దగ్గరకు వెళ్లలేకపోయినా.. దూరం నుంచే ఆ అనుభూతిని చెందినట్లుగా పేర్కొన్నారు. ‘‘మతపరమైన భేదాలు త్వరలోనే సమసిపోతాయని భావిస్తున్నా. మత పరంగా కాకుండా అందరూ ఒక్కటే అని చెప్పే సమయంవస్తుంది’’ అంటూ ఆమె ఆలయ రిజిస్టర్ లో పేర్కొన్నారు. ఈ వివాదంపై సదరు ఆలయ ట్రస్టు సెక్రటరీ స్పందించారు. తాము ప్రోటోకాల్ ను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నట్లు పేర్కొన్నారు.
నిత్యం ఎంతోమంది గుడికి అన్య మతస్థులు వస్తుంటారని.. కానీ.. వారి వివరాలు తెలియని కారణంగా ఎవరూ ఎలాంటి అడ్డు చెప్పరన్నారు. కానీ.. ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రం వివాదాస్పదమవుతుందని.. వారి మతం తెలిసిన కారణంగా.. ఆలయ సంప్రదాయం ప్రకారం అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
ఏమైనా.. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఒకరి మత విశ్వాసాలు గౌరవిస్తూ ఎవరైనా ప్రార్థనాలయాలకు వస్తే వారిని ఆదరించి.. ఆక్కున చేర్చుకునే రోజులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.