ఈ మధ్యనే రిలీజయిన పుష్ప సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తోంది. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాతో పాటు అందులోని పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. అయితే అన్ని పాటల్లో రెండు పాటలు బాగా పాపులరయ్యాయి. మొదటిదేమో ఊ అంటావా మావ ఊఊ అంటావా అయితే రెండోపాట ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ . ఇపుడా పాట ముచ్చట ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఇపుడీ పాట బాగా పాపులరైంది.
యూపీ ఎన్నికల్లో తెలుగు పాట పాపులర్ అవ్వటం ఏమిటి ? ఏమిటంటే తెలుగు సినిమాను, పాటలను హిందీలోకి డబ్ చేసిన విషయం తెలిసిందే. చూపే బంగారమాయనే శ్రీవల్లి హిందీ పాట స్టైల్లోనే కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో మరోక పాటను ఉపయోగించుకుంటోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటి గొప్ప వ్యక్తులు పోరాడిన నేల అంటూ అనేక మంది గొప్పవ్యక్తుల, ప్రముఖులను ప్రస్తావిస్తు కాంగ్రెస్ పార్టీ మరొక పాటను తయారుచేసింది.
తాము తయారు చేసిన ఈ పాటను శ్రీవల్లి పాట ట్యూనింగ్ లో పాడించారు. పార్టీ ప్రచారం మొత్తం ఇపుడు ఈ పాటనే వాడుతున్నారు. దాంతో ఈ పాటను నచ్చిన వారు సినిమాలోని అసలు హిందీ పాటతో పాటు దానికి మూలమైన తెలుగుపాటను కూడా వింటున్నారట. అంటే యూపీ ఎన్నికల్లో పుష్ప పాట ఫీవర్ మొదలైనట్లే కదా. ఇదే పాట సుమారు మరో నెలన్నర రోజులు వినిపించే అవకాశముంది. ఎందుకంటే యూపీలో చివరి విడత ఎన్నిక ముగిసేది ఫిబ్రవరి చివరలో.
మొత్తానికి జనాలను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు చేయని ప్రయత్నం ఉండదు కదా. జనాల్లో బాగా ఎక్కిన పాటలను, డైలాగులను, పంచ్ డైలాగులను చక్కగా తమ అవసరాలకు తగ్గట్లుగా వాడేసుకోవటంలో రాజకీయ పార్టీల తర్వాతే ఇంకెవరైనా. ఇపుడు కాంగ్రెస్ మొదలుపెట్టింది కదా ఇక మిగిలిన పార్టీలు ఏమి చేస్తాయో చూడాల్సిందే. అసలే యూపీలో లెక్కకు మించి రాజకీయ పార్టీలున్నాయి. ప్రతి పార్టీ తలా ఒక సినిమా పాటను తీసుకున్నా ఇక ప్రచారమంతా సినిమా పాటల ఫీవరనే చెప్పాల్సుంటుంది.