ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.9కోట్ల రెమ్యునరేషన్. అది కూడా ఒక యాడ్ నటించినందుకు. మామూలుగా ఒక సినిమా కోసం 60 నుంచి 100 రోజుల మధ్య కాల్షీట్లు ఇవ్వాలి. దానికిచ్చే రెమ్యునరేషన్ తో పోలిస్తే.. వాణిజ్య ప్రకటన కోసం పడే కష్టం.. శ్రమ చాలా తక్కువగా ఉంటాయి. దీనికి తోడు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తుంటారు. అందుకే చాలామంది కమర్షియల్స్ కు నో చెప్పకుండా ఉంటారు. ఇక.. బ్రాండ్ అంబాసిడర్ కోసం భారీగా డీల్స్ కు సై అనటం చూస్తుంటాం.
అయితే.. కొన్నిసార్లు కొంతమంది స్టార్లు మాత్రం.. తమకిచ్చే టెంప్టింగ్ రెమ్యునరేషన్ ఆఫర్లకు నో చెప్పేస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో చేరారు బాలీవుడ్ కుర్ర హీరో ఒకరు. ఆ మాటకు వస్తే.. ఇటీవల కాలంలో భారీ ఆఫర్లు వచ్చినా.. కొన్ని విలువల్ని పాటించి.. అలాంటి వాటికి నో అని చెప్పేయటం ఈ మధ్యన చూస్తున్నాం. అప్పట్లో ఒక శీతలపానీయానికి సంబంధించిన యాడ్ లో పవన్ కల్యాణ్ నటించగా.. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ప్రకటనలో నటిస్తారా? అన్న మాటతో భారీ డీల్ ను వదులుకున్న వైనం తెలిసిందే. తర్వాతి కాలంలో అమితాబ్.. అల్లు అర్జున్.. సాయి పల్లవి లాంటి నటీనటులు ఎందరో ఉన్నారు.
పాన్ మసాలా యాడ్ కు బన్నీ నో చెబితే.. ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కు సాయిపల్లవి నో అంటే నో చెప్పేసింది. తనను నమ్మే అభిమానుల్ని మోసం చేయటం తనకు ఇష్టం లేదని పేర్కొంది.ఇలా భారీ మొత్తాల్ని అభిమానులు తమపై పెట్టుకునే నమ్మకం కోసం త్యాగం చేసే నటులు పలువురు కనిపిస్తారు. వీరికి భిన్నంగా కొందరు నటులు తీసుకున్న నిర్ణయం అభిమానుల ఆగ్రహంతో పాటు విమర్శలకు గురై.. వెనక్కి తగ్గటం కనిపిస్తుంది. పొగాకు సంస్థలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో అక్షయ్ కుమార్.. అజయ్ దేవగన్.. షారుఖ్ ఖాన్ లు నటించటం.. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక.. వెనక్కి తగ్గటం కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మొదట్లోనే తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.
ఒక పాన్ మసాలా యాడ్ కోసం తన వద్దకు వచ్చిన సదరు సంస్థ ప్రతినిధుల భారీ ఆఫర్ కు నో చెప్పేశారు. తమ పాన్ మసాలా యాడ్ లో నటిస్తే రూ.9 కోట్లు ఇస్తామని చెప్పగా.. ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో అందుకు నో చెప్పేసినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. తమను అభిమానించే అభిమానుల కోసం కోట్లాది రూపాయిల రెమ్యునరేషన్ ను వదులుకోవటం మంచి పరిణామమే.