దంపతుల మధ్య జరిగే శృంగారానికి సంబంధించిన వివాదాలు ఈ మధ్యన కోర్టు మెట్లు ఎక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. తనకు ఇష్టం లేకున్నా భర్త తనతో బలవంతంగా సెక్సు చేస్తున్నాడని.. అది కచ్ఛితంగా వైవాహిక అత్యాచారమే అవుతుందన్న ఫిర్యాదులతో న్యాయం కోసం తలుపు తట్టే వైనం ఇప్పుడో చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలాంటి వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తన భర్త తనను కట్నం కోరటంతో పాటు.. వేధింపులకు గురి చేశాడని.. వైవాహిక అత్యాచారానికి పాల్పడుతున్నాడని పేర్కొంటూ తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ అంశాన్నికోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదన అనంతరం.. మేజర్ అయిన భార్యతో జరిపే శృంగారాన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఒకవేళ భార్య వయసు 15-18 ఏళ్ల మధ్యన ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణిస్తామని పేర్కొంది. దీనికి ఆధారంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది. భర్త కట్నం కావాలని కోరటం.. వేధింపులకు పాల్పడటం లాంటివి అంశాల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమెకు విడాకులు మంజూరుచేసింది.అయితే.. వైవాహిక అత్యాచారం కేసును మాత్రం పెట్టలేరని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.