వైసీపీ రెబల్ నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే టిడిపిలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్లో టిడిపి అధినేత చంద్రబాబుతో ఆనం భేటీ అయిన కొద్ది రోజుల తర్వాత ఆయన పసుపు కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై తాజాగా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక దోపిడీ వ్యవస్థను తయారు చేశారని, దొంగల ముఠా తయారైందని ఆనం ఆరోపించారు.
ఆలీబాబా 40 దొంగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ దోపిడీల్లో పెద్ద ఎవరు చిన్న ఎవరు అన్న తేడా లేదని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ భాగస్వాములనని ఆనం సంచలన కామెంట్లు చేశారు. తాను ఎవరిని బూతులు తిట్టలేదని, హింసించలేదని, తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేధించలేదని ఆనం అన్నారు. వైసీపీ నుంచి తనను సాగనంపేందుకు కారణం ఏంటని ఆనం ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థలో దోపిడీని, దానికి కారకులను ప్రశ్నించడమే తన నేరం అని ప్రభుత్వం భావించినట్టు కనిపిస్తోందని ఆనం అన్నారు.
ఒకప్పుడు మీటర్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు జానాబెత్తడైందని, దీనికి మళ్ళీ మూడు రాజధానులు అంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రజల మీద పది లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు. ఏపీలో గంజాయి వనాలను పెంచుతున్నారని, మాదక ద్రవ్యాల దెబ్బకు ఒక తరం నాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.