ప్రముఖ సినీ నటుడు అలీ 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలీ వైసీపీ కండువా కప్పుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే, సినిమాలు, స్నేహం వేరని, రాజకీయాలు వేరని, పవన్ ఎప్పటకీ తన మిత్రుడేనని అలీ చెప్పుకొచ్చారు. అయితే, 2019 ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే టికెట్ ను అలీకి ఇస్తారని గట్టిగా ప్రచారం జరిగింది.
కానీ, అలీకి చివరి నిమిషంలో జగన్ మొండి చేయి చూపించారు. అయితే, భవిష్యత్తులో తనకు జగన్ న్యాయం చేస్తారని అలీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అలీని జగన్ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అలీని పిలిపించుకుని జగన్ మాట్లాడారు కూడా. ఆ భేటీ తర్వాత తన రాజ్య సభ సీటుపై త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన కూడా వస్తుందని అలీ పరోక్షంగా మీడియాకు హింట్ ఇచ్చారు.
దీంతో, ‘బాల’ నటుడి నుంచి స్టార్ కమెడియన్ గా ఎదిగిన అలీ ‘పెద్దల’ సభకు వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, నిన్న విడుదల చేసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అలీ పేరు లేకపోవడంతో అలీతో పాటు చాలామంది షాకయ్యారు. అయితే, తనకు రాజ్యసభ సీటు రాకపోవడంపై అలీ లోలోపల అసంతృప్తితో ఉన్నప్పటికీ…వేరే విధంగా స్పందించారు. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని మాట మార్చారు అలీ.
అంతేకాదు, జగన్ దృష్టిలో తానున్నానని, తనకు జగన్ ఏ బాధ్యత అప్పజెప్పినా ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు అలీ. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదని, అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని అలీ అసలు సంగతి వెల్లడించారు. అంతేకాదు, జగన్ పై తనకు ఆ నమ్మకం ఉందని చెప్పారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కూడా తనకివ్వలేదని, ఆల్రెడీ దాన్ని ఇతరులకు కేటాయించారని అన్నారు.
ఏదో ఒక రోజు జగన్ నుంచి పిలుపు వస్తుందని అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో, సినీ నటుడు అలీకే మూడేళ్లుగా జగన్ సినిమా చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.