తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత 2016లో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. జయలలిత ఉంటున్న వార్డులోకి మరెవరినీ రానివ్వకపోవడం, శశికళతో పాటు మరి కొంత మందిని మాత్రమే ఆమె వార్డులోకి అనుమతించడం వంటి వ్యవహారాలపై అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే అమ్మ మృతిపై అనుమానం ఉందంటూ తమిళనాడు మాజీ సీఎం అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో, నాటి సీఎం పళవి స్వామి…జయలలిత మరణంపై విచారణ జరపాలని ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పళని స్వామి సర్కారు మారడం ,అన్నాడీఎంకేలో లుకలుకలు మొదలవడం వంటి కారణాల నేపథ్యంలో ఆ కమిషన్ వ్యవహారం మరుగున పడిపోయింది. అయితే, తాజాగా ఆ కమిషన్ కు ఎయిమ్స్ వైద్యుల బృందం అమ్మకు అందించిన చికిత్స, వైద్యంపై సంచలన నివేదిక ఇవ్వడంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఆ నివేదికలో జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత ద్రాక్ష, స్వీట్లు, కేక్ వంటి ఆహారం తీసుకున్నారని, అవి తీసుకోవడం వల్లే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని షాకింగ్ రిపోర్ట్ వెల్లడించారు. ఆల్రెడీ థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న జయలలిత స్వీట్లు, ద్రాక్ష, కేక్ వంటివి తినడంతో ఆమె ఊపిరితిత్తులు తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాయని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆమెకు అక్టోబర్ 7న ట్రాకీయోస్టమీ చికిత్స ప్రారంభించారని, డిసెంబర్ 3న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని వెల్లడించారు. ఆ తర్వాత డిసెంబర్ 4న శ్వాస తీసుకోవడానికి కూడా జయలలిత తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, దీంతో ఆమెకు టెక్మో ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబర్ 5న జయలలిత మెదడు, గుండె పనిచేయకపోవడంతోనే ఆమె మరణించారని ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఆమెకు చికిత్స అందించడంలో ఎలాంటి లోపాలు లేవని ఆ నివేదికలో వారు పేర్కొన్నారు.