అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కు కరోనా సోకడంతో ఏప్రిల్ 26 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఛోటా రాజన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో జైలు అధికారులు అతడిని ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అయితే, కరోనాతో పోరాడుతూ ఛోటా రాజన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఛోటా రాజన్ మృతిపై ఎయిమ్స్ ప్రతినిధి స్పందించారు. ఛోటా రాజన్ మరణించలేదని, ఆయన సజీవంగానే ఉన్నారని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకు ఎయిమ్స్ ప్రతినిధి తెలిపారు. ఛోటా రాజన్ కు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఇదే విషయాన్ని ఢిల్లీ సౌత్ డీసీపీ కూడా ధృవీకరించారు. దీంతో, ఛోటా రాజన్ మరణించాడని వస్తున్న వార్తలకు చెక్ పడింది.
కాగా, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటా రాజన్‌ను 2015లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజన్‌పై సుమారు 70 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ముంబైలో 2011లో ఓ జర్నలిస్టును హత్య చేసినట్లు నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో ఛోటా రాజన్‌కు 2018లో జీవిత ఖైదు విధించారు. అప్పటి నుంచి న్యూఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న ఛోటా రాజన్ కు కోవిడ్-19 సోకడంతో ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.