ఏపీ కొత్త కేబినెట్ నేడు కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. పాత మంత్రులలో 11 మందిని కొనసాగించిన జగన్…కొత్తగా మరో 14 మందికి చోటిచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్‌ను కేబినెట్లో కొనసాగించారు. కొత్తగా ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌కు మంత్రి పదవులు ఇచ్చారు.
అయితే, మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డ ఆశావహులు, తమ మంత్రి పదవి నిలబెట్టుకుంటామని ఆశించి భంగపడ్డ మాజీ మంత్రులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలుచోట్ల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. తమ నేతలకు మంత్రి పదవి దక్కకపోవడం సొంత పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగి రచ్చ రచ్చ చేస్తున్నారు.
మేకతోటి సుచరితకు నూతన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై నిన్న రాత్రి గుంటూరులో అభిమానులు భగ్గుమన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రాజీనామాకు సిద్ధమంటూ పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ప్రకటించారు. కేబినెట్లో మిగతా ఎస్సీ మంత్రుల్ని కొనసాగిస్తూ.. సుచరిత పట్ల వివక్ష చూపడమేమిటని ప్రశ్నించారు. సజ్జలను కలిసేందుకు మూడు రోజులుగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయిందని సుచరిత వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సుచరితను బుజ్జగించేందుకు వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ కాన్వాయ్ ను వారు అడ్డుకున్నారు. సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మోపిదేవి కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వకుండా దాదాపు వందమంది చుట్టుముట్టారు. అతి కష్టం మీద పోలీసులు మోపిదేవి వాహనాన్ని అక్కడి నుంచి పంపేశారు. మంత్రి పదవి దక్కకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. స్వయంగా సజ్జల బాలినేని ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా..ఆయన చల్లారలేదని తెలుస్తోంది. బాలినేని ఇంటి దగ్గర ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళన చేశారు. బాలినేనికి చోటు దక్కలేదని ఇంకొల్లు మండలం జెడ్పీటీసీ పదవికి భవనం శ్రీలక్ష్మీ రాజీనామా చేశారు.
ఇక, పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి.. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాచర్ల రింగు రోడ్డులో ద్విచక్రవాహనం, టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పిన్నెల్లికి పదవి ఇవ్వకపోవడంపై మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు ఐదుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీసీలు, 65మంది ఎంపీటీసీలు, 31 మంది కౌన్సిలర్లు.. పదవులకు రాజీనామా చేశారు. బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. సీఎం పేషీ నుంచి పిన్నెల్లికి ఫోన్ రాగా…మీకు మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ కోపంగా పిన్నెల్లి ఫోన్ పెట్టేసినట్లు, ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు తెలుస్తోంది.
తనకు మంత్రి పదవి దక్కలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీకి రాజీనామా చేద్దామని వైసీపీ కొర్పొరేటర్లు, మండల నాయకులు నినాదాలు చేసి… ఎమ్మెల్యేను ఓదార్చేందుకు ప్రయత్నించారు. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందని, కానీ, సీఎం జగన్ నిర్ణయం శిరోధార్యమని అన్నారు. నాయకులెవరూ రాజీనామాలు చేయవద్దన్నారు.
విజయవాడ బందరు రోడ్డులో కొలుసు పార్థసారధి వర్గీయుల ఆందోళన చేపట్టారు. విజయవాడలోని పార్టీ కార్యాలయం ముందు పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు భగ్గుమన్నారు. ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకోగా తృటిలో తప్పించుకున్నారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
తమ నేతకు మంత్రి పదవి దక్కలేదని కొందరు నాయకులు నంద్యాలలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఐదుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో వీరు రాజీనామాలు చేశారు. ఇక, తనకు మంత్రి పదవి రాకపోయినా, తాను రాజకీయాల్లో జగన్ ను వీడేది లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ జగన్ తోనే ఉంటానని వెల్లడించారు. కొత్త క్యాబినెట్, సీఎం సహకారంతో తన నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళతానని తెలిపారు.