ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంపై ప్రధాని మోదీ మొదలు సీఎం జగన్ వరకు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. తెలుగువారి ఖ్యాతిని కీర్తిస్తూ జగన్ కూడా ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. జగన్ ది బావిలోని కప్ప మనస్తత్వం అంటూ అద్నాన్ చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి దారి తీశాయి.
‘‘సముద్రం గురించి ఆలోచించలేని, ప్రాంతీయ మనస్తత్వం ఉన్న చెరువులో కప్ప!! ప్రాంతీయ విభజనలను సృష్టిస్తున్నందుకు, దేశానికి దక్కిన గౌరవాన్ని అందుకోలేకపోతున్నందుకు సిగ్గుపడు. జై హింద్!!’’ అంటూ అద్నాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. దీంతో, అద్నాన్ సమీపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై అలాంటి విమర్శలు చేయడంపై మండిపడుతున్నారు. ఒక తెలుగు పాట అవార్డు దక్కించుకుందని, ఓ తెలుగు వ్యక్తి గర్వపడడం మిగతా వారిని అవమానించినట్లా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ ది భాషాభిమానం.. విభజన కాదు అని హితవు పలుకుతున్నారు.
తనై తీవ్ర విమర్శలు రావడంతో అద్నాన్ సమీ వివరణనిచ్చే ప్రయత్నం చేస్తూ మరో ట్వీట్ చేశారు. ‘‘నేను మాట్లాడేది భాష గురించి కాదు. నా ఉద్దేశం చాలా సింపుల్.. ‘ఇండియన్ ఫస్ట్’ అనే గొడుగు కిందికే అన్ని భాషలు వస్తాయి. భారతీయత తర్వాతే ఏదైనా. అంతే. నేను కూడా ప్రాంతీయ భాషల్లో ఎన్నో పాటలు పాడాను. అన్నింటినీ ఒకే రకంగా కష్టపడి పాడాను..అన్ని భాషలపై సమానమైన గౌరవంతో పాడాను’’ అని వివరణ ఇచ్చారు.