లక్ష కోట్ల రూపాయిలు. అంకె విన్నంతనే వావ్ అనిపించేలా ఉంటుంది. అలాంటిది కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు అపర కుబేరులకు సంబంధించిన రూ.2 లక్షల కోట్ల సంపద కరిగిపోయిన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ.
దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన పారిశ్రామిక దిగ్గజంగా గౌతమ్ అదానీని చెబితే.. ప్రపంచంలో చాలా వేగంగా కుబేర స్థానానికి చేరుకున్న దిగ్గజ పారిశ్రామికవేత్తగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను చెప్పొచ్చు. ఈ ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన కంపెనీల షేర్లు రోజులో భారీగా నష్టపోయాయి. ఆయనకు చెందిన కంపెనీల్లో కనిష్ఠంగా 4 శాతం.. గరిష్ఠంగా 8 శాతానికి పైనే షేర్ల విలువ పడిపోవటంతో భారీగా సంపద కరిగిపోయిన పరిస్థితి.
బ్లూమ్ బర్గ్ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ లు రోజులో 25 మిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. సోమవారం ఈ ఇద్దరు దిగ్గజాల షేర్లు భారీగా పతనం కావటంతో వారికి చెందిన సంపద పెద్ద ఎత్తున కరిగిపోయిన పరిస్థితి. ఈ మొత్తం మన రూపాయిల్లో చెప్పాల్సి వస్తే.. రూ.2లక్షల కోట్లకు పైనే ఉంటుంది.
షేర్ మార్కెట్ సిత్రం ఏమంటే.. షేర్ ధరలు అమాంతం పెరిగిన వేళ.. ఇంత సులువుగా సంపద పెరుగుతుందా? అన్న భావన కలుగుతుంది. చిన్న చిన్నా కారణాలతో పాటు.. సెంటిమెంట్ ఏ మాత్రం దెబ్బ తిన్నా.. అప్పటివరకు ఉన్న ధరలు పతనం మొదలైతే.. అప్పటివరకు కొండలా ఉన్న సంపద ఇట్టే కరిగిపోయే పరిస్థితి. సోమవారం ఒక్కరోజులో అదానీ గ్రూప్ నకు చెందిన కంపెనీల షేర్ల విలువ మొత్తం పడిపోయిన దాని విలువ రూ.2లక్షల కోట్లు అంటే పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇండెక్స్ రిపోర్టు ప్రకారం ఎలాన్ మస్క్ సుమారు రూ.1.26 లక్షల కోట్లు నష్టపోతే.. అదానీ షేర్లు క్రాష్ కావటంతో ఆయన సంపద రోజులో రూ.78,913 కోట్లు కరిగిపోయింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇంత భారీగా నష్టపోయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా ఈ ఇద్దరు కొనసాగుతున్నారు. కాకుంటే మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచారు.
ఇంతకీ ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటన్న విషయానికి వస్తే.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్లను పెంచటం కూడా స్టాక్ మార్కెట్ల మీద తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా కంపెనీల షేర్లు కుదేలై.. సంపన్నుల సంపద కరిగిపోతోంది.