పెళ్లి తర్వాత టాలీవుడ్ నటి లయ నటనకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లైన తర్వాత అమెరికాలో సెటిల్ అయిన లయ..ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎక్కువగా టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ…రీల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. దీంతో, సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు లయ ప్లాన్ చేస్తున్నారని టాక్ వస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ తన మనసులో మాట బయటపెట్టారు. మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి లయ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 2006లో తన పెళ్లికి పవన్ కల్యాణ్ వస్తారని అనుకోలేదని, కానీ, ఇచ్చిన మాట ప్రకారం ఆయన తన పెళ్లికి అందరికంటే ముందే వచ్చి సర్ ప్రైజ్ చేశారని లయ గుర్తు చేసుకున్నారు.
ఇక, జనసేన అధినేతగా ప్రస్తుతం పవన్ కు ఉన్న ఇమేజ్ గురించి కూడా లయ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం అయ్యే కరిష్మా పవన్ కు ఉందని, ఆయనను సీఎం చేయడం చేయకపోవడం జనం చేతుల్లో ఉందని లయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, పవన్ సీఎం అయితే మాత్రం…సినిమాలో ఉండే బిల్డప్ బయట కూడా ఉంటుందని అన్నారు. అంతేకాదు, సీఎం కుర్చీకి ఆయన న్యాయం చేస్తారని, అందుకు తగ్గ వ్యక్తి అని కొనియాడారు.
ఇక, సీఎం అయినా కాకున్నా పవన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఇమేజ్ పరంగా పవన్ టాప్ లో ఉన్నారని, ఇంకా ఎంత టాప్ కు వెళతారో తెలీదని ప్రశంసించారు. సౌత్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషనే కాదు…రెస్పెక్ట్ కూడా తీసుకునే యాక్టర్ పవన్ అంటూ లయ పొగడ్తలతో ముంచెత్తారు.