సినీ నటి చాందిని వ్యవహారం రాజకీయ.. సినిమా రంగాల్లో సంచలనంగా మారింది. పలు తమిళ చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా తమిళనాడు మాజీ మంత్రి.. అన్నాడీఎంకే నేత మణికంఠన్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా చెన్నైలోని వెప్పేరీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కంప్లైంట్ చేశారు. మాజీ మంత్రి మణికంఠన్.. తాను భార్యభర్తల మాదిరి (లివింగ్ రిలేషన్ లో) బిసెంట్ నగర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో జీవితాన్ని సాగించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా తనకు మూడుసార్లు అబార్షన్ జరిగాయని చెప్పింది. మణికంఠన్ తనకు తెలిసిన స్నేహితుడైన డాక్టర్ సాయంతో అబార్షన్ చేయించారని పేర్కొంది. అతగాడి వేధింపుల కారణంగా తన కళ్లు దెబ్బ తిన్నాయని చెప్పింది.
పెళ్లి చేసుకుందామని అడిగితే.. రహస్యంగా తీసిన తన పర్సనల్ ఫోటోల్ని బయట పెడతానని బెదిరించినట్లుగా ఆరోపించారు.
ఇంతకూ నీకు.. మణికంఠన్ కు పరిచయం ఎలా? అన్న ప్రశ్నకు చాందిని సమాధానం ఇస్తున్నారు. మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో తాను పని చేసే సమయంలో.. ఉద్యోగంలో భాగంగా తరచూ ఇండియాకు వచ్చేదానినని చెప్పారు.
ఆ సందర్భంగా రామనాథపురం అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉన్న మణికంఠన్ ను భరణి అనే వ్యక్తి ద్వారా పరిచయమైందన్నారు.
2017 మే మూడో తేదీన మంత్రిగా ఉన్న మణికంఠన్ ను ఆయన ఇంట్లో కలిశానని.. ఆ సమయంలోనే తన సెల్ ఫోన్ నెంబరు తీసుకున్నారని.. పెళ్లి పేరుతో నమ్మించటంతో తాను ఆయనతో కలిసి ఉన్నట్లు చెప్పారు.
చాందిని ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకున్న చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్ స్పందించారు. ఆడయారు మహిళా పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్లపై మణికంఠన్.. భరణిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఆయన్ను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.