బుల్లితెర నటుడు సిద్ధార్థ్ శుక్లా అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. తెలుగునాట ప్రతి ఇంటా సుపరిచితమైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో అతగాడి పాత్ర సపరిచితం. పేరు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. ఫోటో చూసినంతనే ఇతనేనా? అంటూ ఒక్కసారి అయ్యో అనుకోకుండా ఉండలేరు. టెలివిజన్ స్టార్ గా ఎదిగిన అతడు హిందీ బిగ్ బాస్ 13 సీజన్ విజేతగా నిలవటంతో అతడికి పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు సొంతమయ్యాయి.
కేవలం 40 ఏళ్ల వయసులో గుండెపోటుకు గురైన ఇతని మరణం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ రోజు ఉదయం (గురువారం) పదిన్నర ప్రాంతంలో అతను తుదిశ్వాస విడిచినట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి పడుకునే ముందు కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాడని.. ఆ తర్వాత అతను మెలుకువలోకి రాలేదని చెబుతున్నారు. ఇతగాడి మరనాన్ని ముంబయిలోని కూపర్ ఆసుపత్రి ధ్రువీకరించింది.
నిద్రలో ఉండగా.. తీవ్రమైన గుండెపోటుతో మరణించి ఉంటారని భావిస్తున్నారు. సిద్ధార్థ్ కు తల్లి.. ఇదరు సిస్టర్స్ ఉన్నారు. బుల్లితెర నటుడిగా ఎదిగిన తర్వాత బిగ్ బాస్ లో విజేతగా నిలవటంతో అతడికి ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మకి దుల్హనియా” మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సహాయక పాత్ర పోషించాడు. బిగ్ బాస్ 13 సీజన్ లో అనేక వివాదాల నడుమ విజేతగా నిలిచారు. “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7” లాంటి రియాలిటీ షోలలో నటించాడు.
చిన్న వయసులో హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు తరలిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విషాదకరమైన విషయం ఏమంటే.. చిన్నారిపెళ్లికూతురు (హిందీలో బాలికా వధు) ఆనంది క్యారెక్టర్ పోషించిన ప్రత్యూష బెనర్జీ (కౌమార దశ) ఆత్మహత్య చేసుకోవటం.. ఇది జరిగిన కొన్నాళ్లకే సిద్ధార్థ్ అనుకోని రీతిలో హఠ్మాన్మరణం చెందటం గమనార్హం. ఇలా ఒక సూపర్ హిట్ సీరియల్ పెయిర్ అర్థాంతంగా లోకాన్ని వీడిపోవటం గమనార్హం.