టీనేజీలో ఉండగానే తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మలా కాన్వెంట్ అనే పిల్లల సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. కానీ ఆ సినిమా తేడా కొట్టేసింది. దీంతో గ్యాప్ తీసుకుని పెళ్ళి సందడి చిత్రంతో కొడుకును పూర్తి స్థాయి హీరోగా దించాడు శ్రీకాంత్.
అదొక పేలవమైన సినిమా అయినప్పటికీ.. హీరో హీరోయిన్ల ఆకర్షణ.. పాటలు.. రిలీజ్ టైమింగ్ కలిసొచ్చి తోడై సినిమా ఉన్నంతలో బాగానే ఆడింది. ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదుగుతోంది. ఐతే శ్రీలీల ఇలా\దూసుకెళ్తుంటే.. ఆ చిత్ర హీరో రోషన్ మాత్రం అడ్రస్ లేకుండా పోయాడు. ఇతను ఏమయ్యాడు అనుకుంటుండగా.. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు రోషన్.
వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో రోషన్ రెండో సినిమా చేస్తుండటం విశేషం. ఆ సినిమాకు ఛాంపియన్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమా కోసం కొంచెం గడ్డం పెంచి రఫ్ లుక్‌లోకి మారాడు రోషన్. అమ్మ పాట సహా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన ప్రదీప్ అద్వైతం అనే టాలెంటెడ్ ఫిలిం మేకర్ ఈ చిత్రంతో ఫీచర్ ఫిలిం డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. దీంతో పాటు ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు అనే కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలోనూ శ్రీకాంత్ హీరోగా నటించనున్నాడు.
ఈ సినిమాకు దర్శకుడెవరు, ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. రెండో సినిమా వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో, ఒక అభిరుచి ఉన్న దర్శకుడితో చేయబోతుండటం మాత్రం విశేషమే. రోషన్ చేయబోయే సినిమాలు తనకు మంచి పేరు తెచ్చి స్టార్‌ను చేస్తాయని ఆశిద్దాం.