నేచురల్ స్టార్ నాని గురించి ఈ మధ్య కొన్ని క్రేజీ వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. అందులో అన్నిటికంటే క్రేజీ న్యూస్ ఏంటంటే.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో నాని ఓ సినిమా చేయబోతున్నాడని. అసలు వీళ్లిద్దరికీ ఎలా పొంతన కుదురుతుందో అస్సలు అర్థం కాలేదు జనాలకి. ఎందుకంటే నాని ఎలివేషన్లకు దూరంగా, క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేసుకుపోతుంటాడు.
ప్రశాంతేమో.. ఎలివేషన్లకు కేరాఫ్ అడ్రస్ అయిన మాస్ మూవీస్ చేస్తాడు. కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్ తర్వాత అతడి రేంజే మారిపోయి టాప్ హీరోలతో వరుసగా లైనప్ రెడీ అయింది. ఈ నేపథ్యంలో నానితో ప్రశాంత్ సినిమా ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని రోజులుగా గట్టిగా ప్రచారం జరిగింది.
దీంతో పాటుగా మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న కొత్త చిత్రంలో, అలాగే విజయ్-వంశీ పైడిపల్లి సినిమాలో నాని ప్రత్యేక పాత్రలు పోషించబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. వీటి మీద నాని, అతడి టీం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ ఊహాగానాలు అలాగే కొనసాగాయి.
ఐతే తన కొత్త చిత్రం అంటే సుందరానికీ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన నాని.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేశాడు. పైన చెప్పుకున్న మూడు కాంబినేషన్లలోనూ తాను భాగం కాదని నాని తేల్చిచెప్పాడు. ఇలాంటి వార్తలు ఎవరు, ఎందుకు పుట్టిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని నాని అన్నాడు.
ప్రస్తుతం తాను చేస్తున్నది ఒక్క దసరా సినిమా మాత్రమే అని, తన 30వ సినిమా గురించి కూడా తనకే క్లారిటీ లేదని నాని చెప్పాడు. తనకు క్లారిటీ వచ్చాక పుట్టిన రోజో, ఇంకో సందర్భమో చూసి ఆ స్పెషల్ ప్రాజెక్టును అనౌన్స్ చేస్తానని నాని తెలిపాడు. ఇక తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న మీట్ క్యూట్ సినిమాకు డిజిటల్ రిలీజ్ ఉంటుందని, అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న హిట్-2 పెద్ద రేంజిలో ఉంటుందని నాని తెలిపాడు.