నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం ఆత్మహత్య ఏపీలో కలకలం సృష్టిస్తోంది. ఎటువంటి తప్పు చేయకపోయినా మమ్మల్ని పోలీసులు వేధిస్తున్నారు అంటూ సలాం కుటుంబం వీడియో తీసి ఆత్మహత్య చేసుకోవడం ఏపీని కుదిపేస్తోంది.
ఇప్పటికే దళితులపై వరుస దాడులతో ప్రభుత్వ పరువు మంటగలిసి పోయిన నేపథ్యంలో గత ఏడాది జగన్ కి మద్దతు ఇచ్చిన మరో వర్గంపై కూడా జగన్ హయాంలో దాడులు జరగడం, వేధింపులకు పాల్పడటం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఏ నేరమూ చేయని ఒక కుటుంబం నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలిచివేస్తుంది. తనలాంటి అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలని ఆయన తన బాధను వీడియోలో చిత్రీకరించి ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే వెనుకుండి నడిపించిన వారిని వదిలేసి పోలీసులపై మాత్రమే ఈ నేరాన్ని రుద్దే రాజకీయ ప్రయత్నం జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు అనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనం… అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు.