టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి పరిచయం అక్కర లేదు. భారత్ తరఫున సుదీర్ఘ కాలం రాణించిన క్వాలిటీ స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకరు. మైదానంలో గింగరాలు తిరిగే బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను కట్టడి చేసే హర్భజన్ కు టర్బోనేటర్ అని పేరుంది. తన ఆటతీరుతో పాటు మాటతీరు, చేతలతోనూ హర్భజన్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుండేది. ప్రత్యర్థి ఆటగాళ్లతోనే కాదు సొంత జట్టులోని ఆటగాళ్లతోనూ భజ్జీ తీరు వివాదాలకు దారి తీసింది.
ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ తో మంకీ గేట్ వివాదం, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ప్రేక్షకులందరి ముందు లైవ్ లో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడం వంటి వ్యవహారాల్లో హర్భజన్ తీరు వివాదాస్పదమైంది. ఇక, పాక్ క్రికెటర్ లతో భజ్జీ పలు మార్లు ట్వీట్ వార్ చేసి వార్తల్లో నిలిచాడు. అటువంటి హర్భజన్ ను ఆప్ తరఫున రాజ్య సభకు పంపాలని అనుకుంటున్నారన్న వార్త ఇపుడు చర్చనీయాంశమైంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇపుడు రాజ్య సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాలను దక్కించుకున్న ఆప్ కు 5 రాజ్యసభ స్థానాలు దక్కాయి. దీంతో, ఆ ఐదుగురిలో ఒకరిగా హర్భజన్ సింగ్ ను ఆప్ తరఫున రాజ్యసభకు పంపాలని కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అనుకుంటున్నారట.
పంజాబ్ కు సేవ చేయాలనుందని గతంలో వెల్లడించిన హర్భజన్ ను 2019 లోక్ సభ ఎన్నికలలో అమృత్సర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దించాలని బీజేపీ ప్రయత్నించి విఫలమైంది. కానీ, తాజాగా ఆప్ తరఫున పెద్దల సభకు వెళ్లేందుకు మాత్రం ఈ వివాదాస్పద క్రికెటర్ సిద్ధంగా ఉన్నాడట. దీంతోపాటు, జలంధర్లో కొత్తగా ఏర్పాటు చేయబోతోన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించాలని భగవంత్ సింగ్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆప్ తరఫున భజ్జీ పెద్దల సభకు వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, పంజాబ్ నుంచి ఎన్నికైన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగియనుండగా…తాజాగా ఆ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 21 చివరి తేదీ. మార్చి 31న పోలింగ్, కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనున్నారు.