ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రతిహత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కేజ్రీవాల్ కు క్రేజీ షాక్ తగిలింది. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ఘోర పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. బీజేపీ గెలుపు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో పర్వేష్ వర్మ ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఎంపికవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ హోరాహోరీ పోరులో విజయం సాధించారు. కౌంటింగ్లో చివరి వరకు వెనుకంజలో ఉన్న అతిశీ అనూహ్యంగా చివరి రౌండ్లో పుంజుకుని విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై ఆమె గెలుపొందారు. గతంలో అతిశీపై బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన సిసోడియా కూడా ఘోర పరాజయం పాలయ్యారు. 600 ఓట్ల తెేడాతో ఆయన ఓడిపోయారు.
ఇక, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై బీజేపీ కూర్చోవడం దాదాపుగా ఖాయమైంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో బీజేపీ 37 స్థానాల్లో ముందంజలో ఉండగా…11 స్థానాల్లో గెలుపొందింది. ఇక, ఆప్ 12 స్థానాల్లో ముందంజలో ఉండగా 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ పార్టీ భోణీ కూడా కొట్టకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.