క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే . చాలాకాలంగా పార్టీ వైఖరి నచ్చక విమర్శలు గుప్పిస్తున్న ఆనం ఎట్టకేలకు తన సస్పెన్షన్ తర్వాత నోరు విప్పారు. ఈ సందర్భంగా పార్టీలోని లుకలకలు, అంతర్గత వ్యవహారాలపై ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఆనం షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాము 10 నుంచి 20 కోట్లు తీసుకుని టీడీపీకి అమ్ముడుపోయామని సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆనం మండిపడ్డారు. సాధారణ జర్నలిస్టు స్థాయి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి తనకంతా తెలుసు అని, సాదాసీదా జర్నలిస్టు సజ్జల వందల కోట్లకు ఎలా పడగలెత్తారని ఆనం ప్రశ్నించారు. సజ్జల లాగే ప్రజాస్వామ్యంలో అందరూ విలువలు లేకుండా ఉంటారని ఆయన అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీక్రెట్ బ్యాలెట్లో ఎవరు ఎవరికి ఓటు వేశారు అన్న విషయం వైసీపీ నేతలకు ఎలా తెలుసు అని ఆనం ప్రశ్నించారు.
తాను ఎవరికి ఓటు వేశానో సజ్జలకు ఎలా తెలుసని ఆయన నిలదీశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయబోతున్నామని అన్నారు. ఆనం ఓటును పరిగణలోకి తీసుకోలేదని సజ్జల ఓటింగ్ కు ముందు రోజు చెప్పారని, ఆ తర్వాత ఓటింగ్ పూర్తయిన వెంటనే తనపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని సమన్వయకర్తగా నియమించిన రోజే తాను పార్టీకి దూరమయ్యానని అన్నారు.
గతంలో సజ్జల అవినీతిని తాను ప్రశ్నించానని, ఆ సమయంలో జగన్ స్వయంగా తనకు ఫోన్ చేసి అలా మాట్లాడొద్దని వారించారని ఆనం గుర్తు చేసుకున్నారు. సద్విమర్శలను ప్రభుత్వం స్వీకరించాలని, కానీ అలా స్వీకరించలేని ప్రభుత్వంతో కలిసి పని చేశానని అన్నారు. ఇక, వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకు గౌరవం, విలువ లేదని ఆరోపించారు. గతంలో కొంతమంది సీఎంలు, ఎమ్మెల్యేలు విలువలను గుర్తించే వాళ్ళని ఆనం అన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోవడం ఎన్నడూ చూడలేదని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ తనను సస్పెండ్ చేసిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలని, కార్యకర్తల అభిప్రాయం తీసుకొని త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. అయితే, ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.