ఇటీవలి కాలంలో కొన్ని యాడ్ లు తీవ్ర స్థాయిలో వివాదాస్పమవుతున్నాయి. కొన్ని యాడ్స్ కాన్సెప్ట్ లు మతపరమైన అంశాలతో ముడిపడి ఉండడం, ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శలు రావడం, చివరకు ఆ యాడ్ ను తొలగించడం జరుగుతున్నాయి. గతంలో ప్రముఖ నగల కంపెనీ ‘తనిష్క్‘ రూపొందించిన యాడ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
మొన్నటికి మొన్న ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ ప్రముఖ వస్త్ర సంస్థ రూపొందించిన యాడ్ పై దుమారం రేగింది. పెళ్లి సందర్భంగా రూపొందించిన ఆ యాడ్ లో పెళ్లికూతుర్ని కన్యా ‘దానం‘ చేయటం ఏంటంటూ ఆలియా ప్రశించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ఓ యాడ్ కూడా ఇదే కోవలో వివాదాస్పదమైంది.
సియట్ కంపెనీ టైర్ల యాడ్ లో నటించిన ఆమీర్… దీపావళి పండుగ సందర్భంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చవద్దని సందేశమిచ్చారు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ యాడ్ హిందువుల్లో అశాంతి సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. సియట్ కంపెనీ హిందువుల సెంటిమెంటును గౌరవిస్తుందని ఆశిస్తున్నానని సియట్ ఎండీ, సీఈవో వర్ధన్ గోయెంకాకు అనంతకుమార్ లేఖ రాశారు.
వీధుల్లో క్రాకర్స్ కాల్చవద్దని సలహా ఇవ్వడం మంచిదేనని, అదే సమయంలో రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న మరో సమస్యను పరిష్కరించాలని తాను అభ్యర్థిస్తున్నానని హెగ్డే అన్నారు. శుక్రవారం నమాజ్ పేరిట రోడ్లు బ్లాక్ చేయడం,అజాన్ పేరిట ముస్లిములు మసీదుల నుంచి శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లడం కూడా సమస్యలేనని అనంతకుమార్ ఆరోపించారు. మరి, ఈ ప్రకటనపై సియట్ , అమీర్ ఖాన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.