తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సందర్భానుసారంగా టీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతున్న షర్మిల…సీఎం కేసీఆర్ పైనా పదునైన విమర్శలు చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో …కేసీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసమే ఓ కొత్త పథకం తెచ్చానని చెప్పుకునే ఏకైక సీఎం కేసీఆర్ అని షర్మిల ఎద్దేవా చేశారు. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి మరొకరు లేరని, ఉప ఎన్నిక వస్తే తప్ప కేసీఆర్ కు దళితులు గుర్తుకు రారా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రైతులు,నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని,అయినా కేసీఆర్ కు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని ఎద్దేవా చేశారు. ఎంత మంది చచ్చినా కేసీఆర్కు ఇంగిత జ్ఞానం లేదుని, లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయకుండా కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజల కోసమా? లేక అధికార పార్టీ బలం నిరూపించుకోవడం కోసమా? అని టీఆర్ఎస్ ను ప్రజలు నిలదీయాలని షర్మిల పిలుపునిచ్చారు. బీజేపీని కూడా నిలదీయాలని, డబ్బుకు అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీ నేతలనూ ప్రశ్నించాలని అన్నారు. అందరి చేత రాజీనామాలు చేయించాలని, దళితుల భూములను లాక్కుని లక్ష కోట్లకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. దళితులకిచ్చేది కేసీఆర్ డబ్బేమీ కాదని, ఒక్కో దళిత కుటుంబానికి కేసీఆర్ 51 లక్షలు బాకీ ఉన్నారని, మిగతా 41 లక్షలు వసూలు చేయాలని అన్నారు.