సుదీర్ఘ కాలం తరువాత భారత్ కల నెరవేరింది. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టాడు.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మొదటి ప్రయత్నంలో ఆయన జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు.
రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్కు చెందిన వీ వెసెలీ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 85.44 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు.
పాకిస్తాన్‌కు చెందిన నదీమ్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన గరిష్టంగా 84.62 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు.
టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధిస్తారని ఆశించిన అతి కొద్దిమంది యువ క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకరు.
గత కొన్నేళ్లుగా జావెలిన్ త్రోలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నీరజ్ చోప్రా అందరికీ ఆకట్టుకుంటూ వచ్చారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ-3లో 88.07 మీటర్లకు జావెలిన్ త్రో విసిరి నీరజ్ తన సొంత జాతీయ రికార్డును తానే అధిగమించారు.
అంజూ బాబీ జార్జ్ తరువాత అన్ని ప్రపంచ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణాలు పతకం గెలుచుకున్న భారతీయ అథ్లెట్ నీరజ్ మాత్రమే.
పానిపట్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన నీరజ్ చిన్నతనంలో 80 కిలోలు ఉండేవాడు. కుర్తా పైజామా ధరించిన నీరజ్‌ను అందరూ సర్పంచ్ అని పిలిచేవారు.
బరువు తగ్గడం కోసం నీరజ్ పానిపట్‌లోని స్టేడియానికి వెళ్లేవాడు. కొందరు సన్నిహితులు ఇచ్చిన సలహాతో జావెలిన్ త్రో ప్రయత్నించాడు. అక్కడినుంచి అతని క్రీడా ప్రస్థానం ప్రారంభమైంది.
జావెలిన్ త్రోలో రాణించేందుకు మెరుగైన సౌకర్యాల ఉన్న పంచకులాకు నీరజ్ పయనమయ్యాడు. అక్కడ మొదటిసారిగా జాతీయ స్థాయి జావెలిన్ త్రో ఆటగాళ్లతో తలపడ్డాడు.
జాతీయ స్థాయిలో ఆడడం ప్రారంభించిన తరువాత నీరజ్ చేతికి మంచి జావెలిన్ అందింది. దాంతో అతని ప్రదర్శన కూడా మెరుగైంది.
2016లో పోలండ్‌లో జరిగిన యూ-20 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ స్వర్ణ పతకం సాధించారు.
గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 86.47 మీటర్ల జావెలిన్ త్రోతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో 88.07 మీటర్ల జావెలిన్ త్రోతో జాతీయ రికార్డును నెలకొల్పడమే కాక స్వర్ణ పతకాన్ని కూడా సాధించాడు.