మన దేశంలో దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయితే, మొట్టమొదటి సారి ఆధార్ నమోదు చేసే క్రమంలో చాలామంది ఆధార్ కార్డుల్లో అనేక తప్పులు దొర్లాయి. కొందరి ఫొటోలయితే గుర్తుపట్టలేని రీతిలో ఉన్నాయి. దీంతో, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డులో ఫొటో, ఫోన్ నంబర్, డేట్ ఆప్ బర్త్ వంటి అనేక సవరణలు చేసుకుంటేనే పథకానికి అర్హులంటూ నిబంధన విధించింది.
ఇటీవల, ఏపీలో జగనన్న చేయూత పథకం లబ్ధిదారుల ఆధార్ కార్డులకు ఫోన్ నంబర్ తప్పనిసరిగా జత చేయాలంటూ ఏపీ సర్కార్ నిబంధన విధించడంతో ఆధార్ సవరణ కేంద్రాలకు లబ్ధిదారులు పోటెత్తారు. ఈ ఒక్క పథకమనే కాదు వివిధ పథకాలకూ ఆధార్ సవరణల కోసం నిత్యం వందలాది మంది ఆధార్ కేంద్రాలు, నిర్దేశిత బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. ఇక, కొన్నిసార్లయితే తమ వంతు వచ్చే సరికి పథకానికి ఆధార్ సమర్పించాల్సిన గడువు కూడా ముగిసిపోయిన దాఖలాలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై, ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు కూడా అందించనుంది. సచివాలయ సేవలను మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని నిర్ణయించింది. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శిస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాలు అందని అర్హులను గుర్తిస్తారని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి,కానివి లిస్టు చూపించాలని అధికారులను పెద్దిరెడ్డి ఆదేశించారు.