మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి ఘటన ఏపీలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉమపై దాడి చేయడమే కాకుండా, దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఉమపైనే అక్రమ కేసు బనాయించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఉమ అరెస్టు, 14 రోజుల రిమాండ్ వంటి వ్యవహారాలు జగన్ నియంత పాలనకు నిదర్శనమని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలని ఉమ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా…ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా దేవినేని ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జి.కొండూరులో అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేసేందుకు ఉమ వెళ్లారని, ఆ సమయంలో ఉమపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని కోర్టుకు ఉమ తరపు న్యాయవాది తెలిపారు. దేవినేని ఉమపై ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్ ఏ నేరానికీ పాల్పడలేదన్నారు.
దేవినేని ఉమను విచారణకు కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారని, ఈ కేసులో విచారించడానికి ఇతరులను అరెస్టు చేయాల్సి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు మంగళవారం నాడు విన్న హైకోర్టు…బుధవారం నాడు ఉమకు బెయిల్ మంజూరు చేసింది.
వాస్తవానికి ఉమ అరెస్టయిన మరుసటి రోజే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో స్టేషన్ రికార్డులను కోర్టుకు పోలీసులు సమర్పించలేదు. స్టేషన్ నుంచి రికార్డులు తెప్పించాలని ఉమ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, ఆ అభ్యర్ధనను అంగీకరించని హైకోర్టు…ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ క్రమంలోనే ఉమ బెయిల్ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం నాడు వాదనలు విన్న హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, జగన్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు కాగా…ఉమకు ఊరట లభించినట్టయింది.