- డాక్టర్ సుధాకర్‌తో మొదలు
- 2 నెలలుగా జైల్లోనే జడ్జి రామకృష్ణ
- ధూళిపాళ్లపై కక్ష, బెయిల్ రావడం జీర్ణించుకోలేని పాలకులు
- సంగం డెయిరీ భేటీ జరిపినందుకు కరోనా నిబంధనల ఉల్లంఘన కింద కేసు
- శంకుస్థాపనలు, ప్రారంభాలకు వందలాదిగా వైసీపీ శ్రేణుల హాజరు
- జాతరగా ప్రభుత్వ కార్యక్రమాలు అయినా కేసు నమోదు కాదు
- తాజాగా నష్టపోయిన ఉమపై కేసు,
నవ్యాంధ్రలో చట్టం ప్రభుత్వ పెద్దలకు మాత్రమే చుట్టమన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు నోరెత్తితే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పెద్దలు టార్గెట్ చేసినవారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేస్తున్నారు.
కరోనా సమయంలో మాస్కులు, కిట్లు లేవని అన్న పాపానికి నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ను వేధింపులకు గురిచేసి.. చనిపోయేవరకు మానసిక, శారీరక క్షోభకు గురిచేసిన ప్రభుత్వం.. సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణను రెండు నెలలుగా జైల్లో ఉంచింది.
ఇక విపక్షాలపై పెద్దఎత్తున అణచివేతకు పాల్పడుతోంది. జగన్‌పై గతంలో అవినీతి ఆరోపణలు చేస్తున్నవారిని ఎంపిక చేసుకుని.. అనారోగ్యంతో ఉన్నా.. శస్త్రచికిత్సలు చేయించుకుని ఉన్నా పట్టించుకోకుండా అమానుషంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులతో నెలల తరబడి జైల్లో ఉంచాలని చూస్తున్నారు.
మృదుస్వభావిగా పేరొందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై హత్య కేసు నమోదు చేయించి అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ మంజూరు కాకుండా విశ్వప్రయత్నాలు చేశారు. తర్వాతి వంతు టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిది.
ఈఎస్ఐ స్కాం కేసులో తెల్లవారుజామున ఇంటి గోడలు దూకి మరీ పోలీసులు అరెస్టుచేశారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉన్న ఆయన్ను మందులు కూడా తీసుకోనివ్వకుండా ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడ వరకు కారులో వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు.
కరోనా పరీక్షలు కూడా జరపకుండా.. ఓ పక్క బ్లీడింగ్ అవుతున్నా… ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లతో ధ్రువపత్రం ఇప్పించి జైలుకు పంపారు. కరోనా సోకినా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా జైల్లోనే చికిత్స చేయించాలని చూశారు. చివరకు హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది.
తాజాగా సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను కూడా ఇలాగే అక్రమంగా అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో అమూల్‌కు పాలుపోయడం లేదని కక్షగట్టి.. సంగం డెయిరీని నిర్వీర్యం చేయడానికి.. లేని అవినీతి ఆరోపణలు మోపి.. ఆయన్ను, ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్టు చేశారు.
వారికి కరోనా సోకినా ప్రైవేటు ఆస్పత్రికి తరలించకుండా ప్రభుత్వ ఆస్పత్రి చాలంటూ కోర్టులోనూ మొండికేశారు. ఇదే సమయంలో సంగం స్వాధీనానికి ప్రయత్నించారు. అవసరం లేకున్నా ఏసీబీ అధికారులు రెండు వారాలు ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు జరిపి.. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రయత్నాలన్నిటినీ హైకోర్టు అడ్డుకుంది. నరేంద్రకు బెయిల్ మంజూరుచేసింది. దీంతో ఆయనపై కక్షగట్టిన ప్రభుత్వం.. పాలకవర్గం సమావేశం పెట్టారంటూ ఆయనపైన, ఇతరులపైన కేసు నమోదు చేసింది.
చట్టం తన పని తాను చేసుకుపోవాలన్నది నిజమే. కానీ పై సంఘటనల దరిమిలా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోలీసులు చట్టాన్ని ‘విపక్ష నేతల’ పని పట్టడానికి ప్రయోగిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పక్షంవైపు ఎన్ని అడ్డగోలు ఉల్లంఘనలు జరిగిన పట్టించుకోరు! కానీ… విపక్ష నేతల విషయంలో లేని లోపాలను కూడా వెతికి వెతికి మరీ పట్టుకుని కేసులు పెడతారు.
రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం తల నరికిన దుండగులను ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎవరో వాటర్ బాటిల్ వేశారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏకంగా హత్యాప్రయత్నం కేసు నమోదుచేశారు.
కరోనా కొత్త వేరియంట్‌పై ఇటీవల ఆయన అసత్య ప్రకటనలు చేశారంటూ ఊరూపేరూ లేని వైసీపీ నేతలతో ఫిర్యాదులు చేయించారు. వాటిపై పోలీసులు ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే కేసులు పెట్టారు.
మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అవే వ్యాఖ్యలు చేశారు. వాటిపై టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. పైగా.. గుంటూరు జిల్లాలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా గుంపుగా వచ్చారంటూ వారిపైనే ఎదురుకేసు పెట్టారు.
అదే విధంగా ఇప్పుడు సంగం డెయిరీ పాలకమండలిపైనా ‘కరోనా’ కేసు పెట్టేశారు. అంత్యక్రియలకు 20 మంది, వివాహాలకు 50 మంది హాజరు కావొచ్చని కరోనా నిబంధనలు చెబుతున్నాయి. మే 29న విజయవాడలో సంగం పాలక మండలి భేటీకి.. మొత్తం 15 మంది డైరెక్టర్లలో 12 మంది హాజరయ్యారు.
మరో ముగ్గురు, నలుగురు అధికారులు కూడా వచ్చారు. వీరంతా మాస్కులు పెట్టుకునే ఉన్నారు. దూరం దూరంగా కూర్చున్నారు. కానీ ఈ సమావేశం పెట్టి కరోనా నిబంధనలు ఉల్లంఘించారని డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఇతరులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు పంపుతున్నారు.
బెయిల్ షరతుల ప్రకారం నరేంద్ర విజయవాడలోనే ఉండాల్సి రావడంతో ఇక్కడి ఓ హోటల్లో ఈ సమావేశం పెట్టారు. కరోనా నిబంధనల ప్రకారం పాల డెయిరీలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయి. వాటి కార్యకలాపాలకు కరోనా నిబంధనలు వర్తించవు. అయినా ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో కేసు పెట్టేశారు.
వాళ్లు ఎందరు గుమిగూడినా కరోనా రాదు..
విపక్ష నేతలపై ఇంత పకడ్బందీగా పని చేసే చట్టం… అధికార పార్టీ నేతలకు చుట్టంగా మారుతోంది. వాళ్లు గుంపులు గుంపులుగా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన జరిపారు.
శంకుస్థాపన జరిగిన ప్రతి చోటా అధికార పార్టీకి చెందినవారు వందల సంఖ్యలో హాజరై పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించారు. ఇది కరోనా నిబంధనల ఉల్లంఘన అయినా, వాటిపై కూడా ఎక్కడా కేసులు పెట్టలేదు.
ఉదాహరణకు గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఈ కార్యక్రమానికి 400 మందిని తరలించారు. భౌతిక దూరం పాటించనేలేదు. జిల్లాల్లో అధికారులు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకు కూడా కింది స్థాయి అధికారులు భారీగా హాజరవుతున్నారు.
గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కొద్ది రోజుల కింద తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి నలభై మందికి పైగా అధికారులు హాజరయ్యారు. ఆయన గది కిటకిటలాడింది.
ఇదే గుంటూరులో కొద్ది రోజుల క్రితం డిప్యూటీ మేయర్ కార్యాలయాన్ని ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. దీనికి కూడా వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. ఎక్కడిదాకానో ఎందుకు.. ఇటీవల జరిగిన ఒక్కరోజు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా మాస్కు పెట్టుకోలేదు.
సభా విరామ సమయంలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ గుంపుగా చేరారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో అధికారులు మాస్కులు పెట్టుకుంటున్నప్పటికీ.. ఆయన మాత్రం పెట్టుకోవడంలేదు. ఇది కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే.
వాస్తవానికి నిరుడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా ప్రబలడానికి వైసీపీ ప్రజాప్రతినిధులే కారణం. అభివృద్ధి కార్యక్రమాల పేరిట జాతరలా సభలు నిర్వహించడంతో శ్రీకాళహస్తితో కనీసం 76 మంది ఉద్యోగులు కరోనాబారిన పడ్డారు. వారిలో ఐదుగురు చనిపోయారు కూడా.
ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా వైసీపీ నేతలు బహిరంగంగా వందల మందితో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నా పోలీసులకు కనిపించడం లేదు.
వైద్యులకు ఎన 95 మాస్కులు ఇవ్వడం లేదన్నందుకు..
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేస్తూ సస్పెండైన దళిత డాక్టర్ సుధాకర్ కొద్దిరోజుల కింద గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.
గత ఏడాది కరోనా సమయంలో డాక్టర్లకు ఎన్ 95 మాస్కులు ఇవ్వడం లేదని ఆయన ఓ అధికారిక సమావేశంలో ఆక్షేపించారు. దీంతో ప్రభుత్వం కత్తిగట్టి.. వృత్తి పరమైన నిబంధనలు ఉల్లంఘించారంటూ నిరుడు ఏప్రిల్ 8న ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపై సుధాకర్ తీవ్ర మనస్తాపం చెందారు.
మరుసటి నెలలో ఆయన విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై గలాటా సృష్టిస్తున్నారంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంగా లాఠీలతో చితక్కొట్టారు. చేతులు విరిచికట్టారు. మతిస్థిమితం లేదంటూ పిచ్చాస్పత్రికి తరలించారు. ఇది మరో వివాదంగా మారింది.
దీనిపై దళిత నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఐతో విచారణ చేయించారు. దీనిపై కొద్దిరోజుల్లో తీర్పు రావలసి ఉంది. సస్పెన్షన్ సమయం కావడంతో ఆయనకు జీతం చాలా తక్కువగా వచ్చేది. అది ఖర్చులకు సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ బాధ, ఒత్తిళ్లతో గుండెపోటుతో మరణించారు.
దళిత జడ్జి రామకృష్ణ పరిస్థితి దయనీయంగా ఉంది. నాడు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డితో అభిప్రాయ భేదాల కారణంగా సస్పెండైన ఆయనకు ఇప్పటి వరకు మళ్లీ పోస్టింగు రాలేదు. ఆయన్ను ఉపయోగించుకుని ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కక్ష సాధించాలనుకున్న జగన్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్యను ప్రయోగించింది.
ఆయన తనతో జరిపిన సంభాషణను రికార్డు చేసి హైకోర్టుకు సమర్పించినందుకు రామకృష్ణపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది. సీఎంపై విమర్శలు చేశారంటటూ రాజద్రోహం అభియోగాలు మోపి ఏప్రిల్‌లో ఆయన్ను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఆయనకు బెయిల్ రాలేదు.
జైల్లోనే ఆయన్ను హత్య చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలకు.. ఆయన ఉన్న బ్యారక్‌లో కత్తి కూడా దొరకడం బలం చేకూర్చింది. ఆయన క్షేమం దృష్ట్యా కొన్నాళ్లు జైల్లోనే ఉండడం సబబని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.