నెవర్ ఎండింగ్ స్టోరీ మాదిరి సాగుతున్న మాన్సాస్ ట్రస్టు వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్యన ట్రస్టు ఈవోకు.. ఛైర్మన్ కు మధ్య పడకపోవటం.. ఉద్యోగుల జీతాల్ని చెల్లించాలంటూ ఛైర్మన్ హోదాలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు చెక్కు ఇవ్వటం.. దాన్ని ఈవో ఆపేయటం.. ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారటం తెలిసిందే.
ఉద్యోగుల్ని తన మీదకు అశోక్ గజపతి ఉసిగొల్పారంటూ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. ఈవో సహకారం అందించటం లేదంటూ అశోక్ గజపతి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది.ఈ సందర్భంగా ఈవో తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతి రాజు ఆదేశాల్ని ట్రస్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఛైర్మన్ ఆదేశాల్ని ఈవో ఉల్లంఘించటం సరికాదన్న హైకోర్టు.. ఈవో పాత్ర ఏమిటి? ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయటం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈవో వ్యవహారశైలిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మాన్సాస్ ఛైర్మన్ ఉన్న అశోక్ గజపతి రాజు ఇచ్చే ఆదేశాల్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.
అంతేకాదు.. నెల చివరకు వచ్చేసినా.. ఇప్పటికి గత నెల జీతాలు ట్రస్టు ఉద్యోగులకు అందని వైనంపై కోర్టు సీరియస్ అయ్యింది. ట్రస్టు సిబ్బందికి జీతాల్ని వెంటనే చెల్లించాలని చెప్పింది. ట్రస్టు అకౌంట్స్ సీజ్ చేయాలని ఈవో ఇచ్చిన ఆదేశాల్ని సస్పెండ్ చేసిన కోర్టు.. ఛైర్మన్ కు లేఖ రాసే ముందు సదరు అధికారి కోర్టు తీర్పును ఎందుకు చూడటం లేదని నిలదీసింది. ట్రస్టు ఆడిట్ ను ఆడిట్ అధికారితోనే చేయించాలని ఇతరుల ప్రమేయం వద్దని స్పష్టం చేసింది.
అంతేకాదు.. ట్రస్టు కింద ఉన్న సంస్థల్లో ఈవో జోక్యం చేసుకోవద్దన్న ఆదేశాలతో పాటు.. పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ప్రోసీడింగ్స్ ను సస్పెండ్ చేసింది. మొత్తంగా ఏపీ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు ఈవోకు మింగుడుపడనివిగా మారతాయనటంలో సందేహం లేదు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలు అమలవుతాయా? ట్రస్టు ఉద్యోగులకు జీతాలు అందుతాయా? మళ్లీ ఏదో ఒక ఫిట్టింగ్ ను ఈవో తెర మీదకు తీసుకొస్తారా? లేక.. బుద్ధి తెచ్చుకొని న్యాయస్థానం చెప్పినట్లు నడుచుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. మరేం జరుగుతుందో చూడాలి. కోర్టు తాజా ఆదేశాలు ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతికి ఊరట కలిగిస్తాయని చెప్పక తప్పదు.