ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీలో కీలక ఘట్టం మొదలైన సంగతి తెలిసిందే. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. 4 రోజుల క్రితం జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ కు రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసును మరో మలుపు తిప్పింది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన ముగ్గురి పేర్లను జడ్జికి రంగన్న చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రోజు వచ్చిన నాలుగో వ్యక్తి పొడవుగా ఉన్నారని, ఆయనను గతంలో తాను చూడలేదని రంగన్న పేర్కొనడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రంగన్న వాంగ్మూలం ప్రకారం వివేకా కేసు విచారణను సీబీఐ బృందం వేగవంతం చేసిందని తెలుస్తోంది. వాంగ్మూలంలో రంగన్న వెల్లడించిన పేర్లపై సీబీఐ అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. పులివెందులలో ఏడుగురు అనుమానితులను వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్ సతీష్‌రెడ్డి, డాక్టర్ మధు, కిశోర్‌కుమార్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నాని జోరుగా ప్రచారం జరుగుతోంది.
సీబీఐ విచారణాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో రంగన్న వాంగ్మూలం ప్రకారం దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది. మరోవైపు, వివేకా హత్యకేసులొ విచారణ పేరుతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని సునీల్ కుటుంబంతో పాటు మరో ముగ్గురు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పిటీషనర్ల ఆరోపణలు అవాస్తవమని సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు కోర్టుకు తెలిపారు. కౌంటర్ వేసేందుకు గడువు కోరడంతో ఈ కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా పడింది.