ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఏపి బీజేపీ నేతలు ఢిల్లీలో హాడావుడి చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల మధ్య జల జగడాల గురించి కానీ లేదా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కానీ బీజేపీ చీఫ్ కానీ సీనియర్ నేతలు కానీ రాష్ట్రంలో ఎక్కడా నోరిప్పలేదు. అయితే ఢిల్లీలో జలశక్తి, ఉక్కు శాఖ మంత్రులన కలుస్తు మీడియాలో హడావుడి చేస్తున్నారు. అంతాబాగానే ఉంది కానీ మిత్రపక్షం జనసేన జాడ మాత్రం ఎక్కడా కనబడలేదు.
మిత్రపక్షాలన్నాక ఏమి చేసినా రెండుపార్టీలు కలిసే చేయాలికదా. ఏపిలో ఇద్దరికీ అధికార వైసీపీ కామన్ శతృవన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే టీడీపీ కూడా జాయింట్ ప్రత్యర్ధే. అయితే పై రెండు పార్టీలపై మాట్లాడేటపుడు రెండు పార్టీల నేతలు ఎవరికి వారుగానే మాట్లాడుతున్నారు. ఉద్యోగాల భర్తీ, రైతులకు నిధులు విడుదల లాంటి అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా మాట్లాడుతున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రనిధుల వాటాగురించి చెప్పటం లేదని గోల చేస్తున్నారు బీజేపీ నేతలు. అంతేకానీ ప్రజలందరికీ ఉపయోగపడే ప్రత్యేకహోదా, విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు పునరావసానికి నిధుల్లాంటి అంశాలపై మిత్రపక్షాలు నోరెత్తితే ఒట్టు. సరే ఎవరి అజెండా ప్రకారం వాళ్ళు వెళుతున్నారని అనుకున్నా కనీసం ఢిల్లీకి వెళ్ళేటపుడన్నా రెండు పార్టీల నేతలు కలిసే వెళ్ళాలి కదా.
కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపాలని డిసైడ్ చేసినపుడు జనసేన నేతలను తీసుకెళ్ళటం బీజేపీ నేతల కనీస ధర్మం. అలాగే కేంద్రమంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనపత్రాల్లో కూడా బీజేపీ నేతల పేలున్నాయే కానీ ఎక్కడా జనసేన పార్టీ నేతల పేర్లు కనబడలేదు. అంటే కమలనాదులు ఢిల్లీ వెళ్ళే సమయంలో జనసేన నేతలకు సమాచారం ఇవ్వలేదని అర్ధమైపోతోంది. ఇటు రాష్ట్రంలోను కలుపుకుని వెళ్ళక, ఢిల్లీకి వెళ్ళేటపుడు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోతే ఇక ఇవేమి మిత్రపక్షాలబ్బా?