వాడు నడిపే బండి…రాయల్ ఎన్ ఫీల్డు….వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు….అంటూ కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది సింగర్ మంగ్లి. ఇక, సాయి పల్లవి ఆటకు సారంగ దరియా అంటూ మంగ్లీ పాడిన పాటకు అంతా ఫిదా అయిపోయారు. జానపద గాయకురాలిగా కెరీర్ మొదలు పెట్టిన మంగ్లి…ఆ తర్వాత సినీ, భక్తి పాటలతో పాపులర్ అయింది. రాయలసీమలోని అనంతపురానికి చెందిన మంగ్లికి తెలంగాణలోనూ చాలా ఫాలోయింగ్ ఉంది. దీంతో, ప్రతి పండుగకు సందర్భాన్ని బట్టి భక్తి పాటలు, ఆల్బమ్ లు రిలీజ్ చేస్తుంటుంది మంగ్లి.
తాజాగా తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా మంగ్లి పాడిన ఓ పాట వివాదాస్పదమైంది. ‘చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా’.. అనే పాట యూట్యూబ్ లో వారం కిందట విడుదల కాగా దానిపై విమర్శలు వస్తున్నాయి. ఆ లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని…మొక్కుతున్నట్టు లేవని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పాటను రాసిన రామస్వామిదే తప్పని కొందరంటుంటే…మంగ్లిది కూడా తప్పేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమకు చెందిన మంగ్లీకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలుసంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ పాట వివాదం నేపథ్యంలోనే మంగ్లీపై రాచకొండ పోలీస్ కమిషనర్‌కు బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని, వెంటనే ఆ పాటను యూట్యూబ్, సోషల్ మీడియానుంచి తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లిపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు. మరి, ఈ వివాదంపై పాట రచయిత, మంగ్లిల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.