అమరావతి భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నేతల గగ్గోలు పెడుతోన్న సంగతి తెలిసిందే. అలాంటిదేమీ లేదని టీడీపీ నేతలు చెబుతున్నా….ఆఖరికి అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదంటూ ఏపీ హైకోర్టు ఆ కేసు కొట్టివేసిన జగన్ సర్కార్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నచందంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుకు కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును జగన్ సర్కార్ గతంలోనే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంలో జగన్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది.
జగన్ పాలనలో ఉన్న ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరో మారు చుక్కెదురైంది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టవేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను దేశపు అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అమరావతి భూముల వ్యవహారంలో అనేక లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని, ఆ లోపే కేసు ఏపీ హైకోర్టు కొట్టివేసిందని సుప్రీం కోర్టుకు విన్నవించారు. 2019లో కొత్త ప్రభుత్వం వచ్చాకే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఫిర్యాదులు అందాయని కోర్టుకు తెలిపారు.
అయితే, ప్రభుత్వ వాదనలతో ప్రతివాదుల తరఫు న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, అలాంటప్పుడు విచారణ జరపాల్సిన అవసరం లేదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం…ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసును కొట్టివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో, జగన్ కు సుప్రీం కోర్టులో మరో షాక్ తగిలినట్లయింది.