సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలకు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పంటికింద రాయిలా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లోపాలను, జగన్ పాలనను విమర్శిస్తూ తనదైన శైలిలో ఆర్ఆర్ఆర్ ఎండగడుతున్న వైనం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఇక, వైసీపీలో తానే నెంబర్ 2 అని చక్రం తిప్పుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రఘురామ పలుమార్లు షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా విజయసాయిపై ఆర్ఆర్ఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.రామాయణంలో మందర, శకుని వంటి పాత్రను ప్రస్తుతం వైసీపీలో విజయసాయిరెడ్డిదని రఘురామ ఎద్దేవా చేశారు. దొంగలెక్కలు వేయడంలో విజయసాయి ఘనాపాటి అని, తన స్థాయి గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని మండిపడ్డారు. విజయసాయి త్వరలోనే అంతర్జాతీయ కార్యదర్శి అవుతాడేమో చూడాలంటూ చురకలంటించారు.
సెక్షన్ 124-ఏ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఎవరిది ఏ కులం, ఏ వంశమ తేల్చే చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. సలహాదారుడిగా తలకాయ ఉన్నవాడిని ఒక్కడిని పెట్టుకోమని సీఎం జగన్ కు రఘురామ సలహా ఇచ్చారు. ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయాలని, కానీ, ఏపీలో ప్రజలకు న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని విమర్శించారు. విజయసాయిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.